Family Tragedy: భార్యాబిడ్డలను హతమార్చిన వ్యక్తికి ఉరి
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:41 AM
ప్రేమించి పెళ్లాడిన భార్యతోపాటు ఇద్దరు బిడ్డలను హతమార్చిన వ్యక్తికి వికారాబాద్ డిస్ట్రిక్ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివా్‌సరెడ్డి ఉరి శిక్ష విధించారు.....
2019 నాటి కేసులో వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు
43 ఏళ్ల ఆ కోర్టు చరిత్రలో తొలిసారి ఒకరికి ఉరిశిక్ష
వికారాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రేమించి పెళ్లాడిన భార్యతోపాటు ఇద్దరు బిడ్డలను హతమార్చిన వ్యక్తికి వికారాబాద్ డిస్ట్రిక్ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివా్‌సరెడ్డి ఉరి శిక్ష విధించారు. 2019 నాటి కేసులో దోషిగా తేలిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి వ్యక్తికి ఉరిశిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించారు. వికారాబాద్‌లో కోర్టు ప్రారంభమై 43 ఏళ్లు ఇవ్వగా.. ఒకరికి ఉరిశిక్ష విధించడం ఆ కోర్టు చరిత్రలో ఇదే ప్రథ మం.. తాండూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ కుటుంబం శేరిలింగంపల్లి శివారులో నివసించేది. అదే ప్రాంతానికి చెందిన చాందిని అనే వివాహితను ప్రవీణ్ ప్రేమించాడు. చాందిని భర్త దివ్యాంగుడు కాగా వారికి కుమారుడు అయాన్ ఉన్నాడు. చాందినికి దగ్గరైన ప్రవీణ్.. ఆమె కుమారుడు అయాన్‌ను సొంత కొడుకులా చూసుకుంటానని మాటిచ్చాడు. దీంతో ప్రవీణ్, చాందిని పెద్దలకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకొని వికారాబాద్‌లో కాపురం పెట్టారు. ఆ తర్వాత వారికి ఏంజిల్ అనే కూతు రు జన్మించింది. ప్రవీణ్ ఓ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా, చాందిని స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేసేవారు. పిల్లలిద్దరినీ చాందిని పనిచేసే బడిలోనే చేర్పించారు. అయితే, తన భార్య ఎవరితోనే ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని ప్రవీణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. అదే సమయంలో అయాన్‌ను పాఠశాలలో చేర్పించే సమయంలో తండ్రి పేరు స్థానంలో తన పేరు నమోదు చేయించేందుకు ప్రవీణ్ నిరాకరించాడు. దీంతో గొడవలు మరింత అధికమయ్యాయి. ఈ క్రమంలో 2019 ఆగస్టు 4న ప్రవీణ్ తల్లి, సోదరుడు వికారాబాద్‌లో వారింటికి రాగా.. ముగ్గురూ కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు. దీనిపై చాందిని ఆగ్రహం వ్యక్తం చేయగా ప్రవీణ్ తల్లి, సోదరుడు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రవీణ్.. నిద్రపోతున్న చాందినిని ఇనుప రాడ్డుతో కొట్టి హతమార్చాడు. తాము లేకపోతే పిల్లలు అనాథలవుతారనే ఆలోచనతో అయాన్‌ను, కూతురు ఏంజెల్‌ను కూడా చంపేశాడు. ముగ్గురినీ హతమార్చిన తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రవీణ్ రైలు పట్టాల వైపు వెళుతుండగా.. పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకొని విచారించడంతో జరిగిన దారు ణం వెలుగు చూసింది. అప్పటి ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసరావు సెక్షన్ 302 ఐపీసీ కింద 247/2019 కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి సబ్ డివిజన్ డీఎస్పీ పి.సీతారాం (ఐవో-2), ఆ తర్వాత వచ్చిన డీఎస్పీ ఎ.సంజీవరావు (ఐవో-3) ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా పర్యవేక్షించారు. నేరానికి సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. ఇరుపక్షాల వాదనలను విన్న డిస్ట్రిక్ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి గురువారం తుది తీర్పు వెల్లడించారు. కాగా, కోర్టు తీర్పు విన్న వెంటనే ప్రవీణ్ కన్నీటి పర్యంతమయ్యాడు. భార్య, పిల్లలను హత్య చేసిన రోజే పోలీసులు పట్టుకోకుంటే తాను ఆరోజే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేవాడినని, అప్పుడే తన జీవితం ముగిసిపోయేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు పట్టుకోకపోతే తన జీవితం ఆనాడే ముగిసి ఉరిశిక్ష తప్పేదని వాపోయాడు.