Actor Vijay Deverakonda: ఏ 23 యాప్ తెలంగాణలో లేదు!
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:40 AM
బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారుల బృందం విజయ్‌తో....
చట్టపరంగానే ప్రచారం చేశా
సిట్‌కు తెలిపిన సినీ హీరో విజయ్ దేవరకొండ
బెట్టింగ్ యాప్‌ల కేసులో గంటన్నర పాటు విచారణ
బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంతునూ ప్రశ్నించిన అధికారులు.. గోవిందా 365యాప్‌కు సిరి ప్రచారం
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారుల బృందం విజయ్‌తో పాటు బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంతును కూడా విచారించారు. పంజాగుట్ట, మియాపూర్‌లో నమోదైన రెండు కేసుల్లో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో సోదాలు చేసి, ఆరు బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. తాజాగా విజయ్ దే వరకొండకు నోటీసులు జారీ చేయడంతో మంగళవారం విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు విజయ్‌ను విచారించిన సిట్ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. గతంలో విజయ్ ఏ23 బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. దీనిపై ఈ ఏడాది ఆగస్టు 6న విజయ్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఏ23 బెట్టింగ్ యాప్ పారితోషికానికి సంబంధించిన వివరాలను సిట్ అధికారులు సేకరించారని సమాచారం. వాస్తవానికి తాను ప్రమోట్ చేసిన ఏ23 బెట్టింగ్ యాప్ తెలంగాణలో ఒపెన్ కాదని, తాను చట్టపరంగానే ఆ యాప్‌కు ప్రచారం చేశానని, తర్వాత అది తప్పని తెలియడంతో కొత్తగా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు అంగీకరించడం లేదని విజయ్ వివరించినట్లు తెలుస్తోంది. ఇక, గోవిందా365 అనే బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ నిర్వహించి భారీగా పారితోషికం తీసుకున్న బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంతు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె బ్యూటీ ట్రీట్‌మెంట్ కేంద్రాలు ప్రారంభించిందని గుర్తించిన సిట్ అధికారులు.. పెట్టుబడుల గురించి ఆరాతీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ యాప్ ప్రమోషన్‌ను సిరి హనుమంతు భిన్నంగా నిర్వహించారు. ‘మీరు సంపాదించే ప్రతి రూపాయికి పైసా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నో ట్యాక్స్ బెట్టింగ్ యాప్’ అంటూ ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు.