Share News

Vigilance Raids CMR Rice Stock: సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:34 AM

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైస్‌ మిల్లర్లు పక్కా ప్రణాళికతో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మిల్లర్లు ప్రతి సీజన్‌లోనూ ఇలాగే చేస్తున్నా..

Vigilance Raids CMR Rice Stock: సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి

  • పలు మిల్లుల్లో విజిలెన్స్‌ సోదాలు

  • నెలలో రూ.71.01 కోట్ల స్టాక్‌ మాయం

  • పౌర సరఫరాల శాఖ అధికారులు..మిల్లర్ల పాత్రపై సర్కారుకు విజిలెన్స్‌ నివేదిక

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైస్‌ మిల్లర్లు పక్కా ప్రణాళికతో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మిల్లర్లు ప్రతి సీజన్‌లోనూ ఇలాగే చేస్తున్నా.. సంబంధిత అధికార యంత్రాంగం సరైన సమయంలో తనిఖీలు నిర్వహించకపోవడంతో రూ.కోట్ల విలువైన ధాన్యం దారిమళ్లుతోంది. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు.. రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి సీఎంఆర్‌ కుంభకోణాన్ని వెలికితీస్తున్నారు. తాజాగా నాలుగు రైస్‌ మిల్లుల్లో జరిపిన సోదాల్లో రూ.20.76కోట్ల సీఎంఆర్‌ ధాన్యం దారి మళ్లినట్లు గుర్తించారు. 2024-25 రబీ సీజన్‌తో పాటు 2023-24లోనూ పలువురు మిల్లర్లు ఇదే విధంగా చేతివాటం ప్రదర్శించిన విషయం విచారణలో తేలింది. పౌర సరఫరాల శాఖ అధికారులు, మిల్లర్ల మధ్య జరిగిన లోపాయికారీ ఒప్పందాలను బట్టబయలు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందచేశారని సమాచారం. వనపర్తి జిల్లా పెదమందడి మండలం మోజర్ల గ్రామంలోని వారాహి, చాముండి రెస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. స్టాకును తనిఖీ చేసి రెండు మిల్లుల్లో కలిపి 2024-25 రబీ, ఖరీఫ్‌ సీజన్లకు సంబంధించిన రూ.13.67 కోట్ల విలువైన సీఎంఆర్‌ స్టాకును అమ్ముకున్నట్లు గుర్తించారు. నిర్మల్‌ జిల్లా కడెం ప్రాంతంలోని కట్ట బాలాజీ రైస్‌ మిల్లులో 2024-25 రబీ సీజన్‌కు సంబంధించిన రూ.6.22కోట్ల సీఎంఆర్‌ స్టాకును అమ్ముకున్నట్లు తేల్చారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం దకూర్‌ గ్రామంలోని కన్యకా పరమేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీ్‌సలో రూ.87.01లక్షల సీఎంఆర్‌ స్టాకును అమ్ముకున్నట్లు గుర్తించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం కనిపర్తి గ్రామంలోని శ్రీశైలం మల్లన్న రైస్‌మిల్లులో రూ.9.34 కోట్ల విలువైన 40,649 క్వింటాళ్ల సీఎంఆర్‌ ధాన్యం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. కేసు నమోదు చేసిన విజిలెన్స్‌ అధికారులు.. పౌర సరఫరాల శాఖకు నివేదిక పంపారు. గత నెల 24న ములుగు జిల్లా మల్లంపల్లిలోని శ్రీ అచ్యుత రైస్‌ మిల్లులో తనిఖీలు చేసి రూ.3.81 కోట్ల విలువైన సీఎంఆర్‌ స్టాకు దారి మళ్లినట్లు తేల్చారు. గత నెల 23న సిద్దిపేట జిల్లా ఇర్కోడ్‌ గ్రామంలోని ఎంఎం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌లో సోదాలు జరిపి రూ.1.54కోట్ల ధాన్యం దారి మళ్లినట్లు గుర్తించారు. గత నెల 16న నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపల్లి గ్రామంలోని చాముండేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీ్‌సలో తనిఖీలు చేసి రూ.28.88కోట్ల ధాన్యం మాయమైనట్లు కనుగొన్నారు. గత నెల 14న పెద్ద పాపయ్యపల్లిలోని రవిచంద్ర ఇండస్ట్రీ్‌సలో రూ.6.68కోట్ల సీఎంఆర్‌ దారి మళ్లిందని గుర్తించి, పౌర సరఫరాల శాఖకు నివేదిక పంపారు.

Updated Date - Nov 14 , 2025 | 04:34 AM