ST gurukulam: ఎస్టీ గురుకుల స్కూళ్ల భవన నిర్మాణాల్లో జాప్యం, నాణ్యతపై విజిలెన్స్ విచారణ
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:14 AM
గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. ఎస్టీ గురుకుల పాఠశాలల భవన నిర్మాణాల్లో జాప్యం, నాణ్యత, అక్రమాలపై గత నెలలో...
వివరణ ఇవ్వాలని అధికారులకు నోటీసులు
‘ఆంధ్రజ్యోతి’ కథనంలోని అంశాల ఆధారంగా విచారణ
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. ఎస్టీ గురుకుల పాఠశాలల భవన నిర్మాణాల్లో జాప్యం, నాణ్యత, అక్రమాలపై గత నెలలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘అసంపూర్తిగా గిరిజన గురుకులాలు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 18 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఎనిమిదేళ్లుగా సాగదీయడం, పైగా పనుల్లో నాణ్యత లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఏకంగా విజిలెన్స్ అధికారులతో విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో పనులు ఎందుకు పూర్తిచేయలేకపోయారో స్పష్టం చేయాలని ఆ నోటీసుల్లో ప్రశ్నించారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాష్ట్రంలో 188 ఎస్టీ గురుకుల విద్యాసంస్థలు ఉండగా.. వాటిల్లో 98 కొత్త భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.463 కోట్లు మంజూరు చేసింది. ఏడాదిన్నరలో భవన నిర్మాణాలు పూర్తిచేయాలని గడువు నిర్ణయించినా.. 2016-17, 2022-23లలో మంజూరు చేసిన భవన నిర్మాణాలు ఇంతవరకు పూర్తిచేయలేదు. దీంతో ప్రతి ఏటా 7ు చొప్పున మొత్తం 56ు మేరకు ప్రభుత్వంపై అదనపు భారం పడింది. వాస్తవానికి ఒక్కో భవన నిర్మాణానికి రూ.4.20 కోట్ల చొప్పున నిర్ణయించగా.. పనుల జాప్యం వల్ల ప్రతి భవనంపై రూ.2.50 కోట్లు అదనంగా చెల్లించాల్సి వ చ్చింది. ఈ అంశాలపై సమగ్ర వివరాలతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమై న అంశాల ఆధారంగా విజిలెన్స్ అధికారులు ప్రశ్నావళి తయారు చేసి.. వాటికి సమాధానాలివ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులిచ్చారు.