Misuse of Aarogyasri Funds: సివిల్ పనులకూ ఆరోగ్యశ్రీ నిధులు!
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:22 AM
ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్న నేపథ్యంలో విజిలెన్స్ విచారణ గురువారం మొదలైంది.....
ఎంజీఎం ఆస్పత్రిలో నిధుల దుర్వినియోగంపై విచారణ షురూ
వరంగల్ మెడికల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్న నేపథ్యంలో విజిలెన్స్ విచారణ గురువారం మొదలైంది. ఇందులో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్‌లో విజిలెన్స్ డీఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలు ఫైళ్లను అధికారులు పరిశీలించారు. విచారణలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నితిన్ స్వరూప్, జిల్లా మేనేజర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 2021-2024 సంవత్సరంలో రూ.30 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై విజిలెన్స్ అధికారుల బృందం లోతుగా విచారించనుంది. మరో మూడు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఆరోగ్యశ్రీ నిబంధనలను అతిక్రమించి నిధులను వాడుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. మందుల కొనుగోళ్లలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమించి సివిల్ పనులకూ ఆరోగ్యశ్రీ నిధులను వాడారని ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత కాలంలో పని చేసిన సూపరింటెండెంట్లతో పాటు పలువురు సిబ్బందిని కూడా విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు. ఈమేరకు అన్ని రకాల ఫైళ్లను సమర్పించాలని విజిలెన్స్ బృందం ఆదేశించినట్లు సమాచారం. కాగా గతంలో ఎంజీఎంలో జరిగిన గ్యాస్ కుంభకోణంతోపాటు వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన కుటుంబ నియంత్రణ నిధుల దుర్వినియోగంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా చాలా మంది అధికారులు, ఉద్యోగులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పెన్షన్ అందడంలేదు. తాజాగా ఆరోగ్యశ్రీ నిధుల వ్యవహారంపై విచారణ జరుగుతుండటంతో అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆరోగ్యశ్రీ విభాగంలో పదేళ్లకుపైగా ఒకే సీనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహించడంపై విజిలెన్స్ దృష్టిసారించింది. సదరు అసిస్టెంట్ ఆస్తుల వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.