Congress and BRS are Clashing: విగ్రహాల ఏర్పాటుపై వీడియోల యుద్ధం
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:21 AM
ఎన్నికలనగానే.. ఎక్కడెక్కడి వ్యక్తులపైనా ఎక్కడ లేని ప్రేమలూ వచ్చేస్తాయి! కాసిన్ని ఓట్లు రాలుస్తాయనుకుంటే కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు.. జననేతల విగ్రహాలు, ఎప్పుడో మరణించిన నేతల పేర్లూ...
ఎప్పుడో మరణించిన నేతలే కేంద్రబిందువుగా రాజకీయం
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఇరువర్గాల వ్యాఖ్యలు
(హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి)
ఎన్నికలనగానే.. ఎక్కడెక్కడి వ్యక్తులపైనా ఎక్కడ లేని ప్రేమలూ వచ్చేస్తాయి! కాసిన్ని ఓట్లు రాలుస్తాయనుకుంటే కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు.. జననేతల విగ్రహాలు, ఎప్పుడో మరణించిన నేతల పేర్లూ రాజకీయానికి కేంద్రబిందువులవుతాయ్! హోరాహోరీగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు జరుగుతోందదే!! మాస్ లీడర్లుగా పేరున్న ఎన్టీఆర్, పీజేఆర్ పేర్లు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రచారంలో ప్రధానంగా మారాయి. ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుపైన, సానుభూతి అంశంపైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ‘ఎక్స్’ వేదికగా వీడియో వార్ నడుస్తోంది. ‘‘ఎన్టీఆర్ విగ్రహాలు మేమే పెట్టాం’’ అని బీఆర్‌ఎస్ అంటుంటే.. ‘‘అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత మాది’’ అని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. నాడు పీజేఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబానికి పోటీగా మరో అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టారని కాంగ్రెస్ నిలదీస్తుంటే.. అసలు పీజేఆర్ కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ వ్యాఖ్యలు, ప్రతివాఖ్యల వీడియోలు సోషల్ మీడియాతోపాటు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్లలోనూ ఇరుపార్టీల గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఉదాహరణకు.. టీడీపీ పుట్టిందే కాంగ్రె్‌సకు వ్యతిరేకంగానని, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు పెడతామని చెప్పడం దారుణమని, దీనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీఆర్‌ఎస్ నేతలుచేసిన వ్యాఖ్యల వీడియోలను ఆ పార్టీ కార్యకర్తలు ‘ఎక్స్’లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇక పీజేఆర్ విషయానికి వస్తే.. ఆయన చనిపోయినప్పుడు కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యర్దిని పోటీలో పెట్టి దుష్ట సంప్రదాయానికి తెరతీసిన బీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పుడు మాగంటి విషయానికి వచ్చేసరికి సానుభూతి ఓట్లు అడుగుతోందని కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు. దీనికి కౌంటర్‌గా.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారని బీఆర్‌ఎస్ నేతలు గుర్తుచేస్తూ, ఆ సమయంలో విజయారెడ్డి కేసీఆర్‌ను కలిసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. కేసీఆర్ తనకు చేసిన సహాయం, అందించిన సహకారం గురించి గతంలో విజయారెడ్డి చెప్పినవీడియోలను కూడా పెద్ద ఎత్తున ‘ఎక్స్’ ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు.
ఎన్టీఆర్, పీజేఆర్ గురించి.. సీఎం రేవంత్, మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ చేసిన వాఖ్యల వీడియోలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్లు ఉంటారా. అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది’’ అంటూ సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన వీడియోతో పాటు.. చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలనూ గుర్తుచేస్తూ ధ్వజమెత్తిన వీడియో కూడా వైరల్ అవుతోంది. వాటికి కౌంటర్‌గా.. ‘‘రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను బీఆర్‌ఎస్ పెట్టింది. ఖమ్మంలో 70 అడుగులతో ఏర్పాటుచేశాం. కూకట్‌పల్లిలో, బాన్సువాడలో కూడా పెట్టాం. ఉప ఎన్నికల సందర్భంగా సీఎంకు ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తుకువచ్చాడా. మరి రెండేళ్ల నుంచి ఏం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తుకువస్తున్నారా. పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి ఉన్నా కూడా పీజేఆర్ కుమారుడు విష్ణుకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు. పీజేఆర్‌పై అంత ప్రేమ ఉంటే ఆయన కుమారుడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు’’ అంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యల వీడియో, ‘‘మా నాన్న టీడీపీలో ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించారు’’ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా బాగా వైరల్ అవుతున్నాయి.