Share News

Telangana BJP chief Ramchander Rao: ఉప ఎన్నికలో గెలుపే మోదీకి బహుమతి

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:54 AM

హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించా...

Telangana BJP chief Ramchander Rao: ఉప ఎన్నికలో గెలుపే మోదీకి బహుమతి

  • జూబ్లీహిల్స్‌లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం

  • నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపు

  • రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి

  • బీసీ రిజర్వేషన్‌లపై కాంగ్రెస్‌ అసలు రంగు బయటపడింది: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. నగరవాసులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు లేదన్నారు. జుబ్ల్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని.. ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మజ్లిస్‌, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలున్నాయని, వాటిని ఎండగట్టాలని, సమష్టి కృషితో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి భాగ్యనగరంలోని 8 జిల్లాల ప్రధాన నాయకులతో సమావేశం జరిగింది. ఇందులో పార్టీ బలోపేతం, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42ు రిజర్వేషన్ల అమలు బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ను వరల్డ్‌ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పి గత బీఆర్‌ఎస్‌ సర్కారు విషాదనగరంగా మార్చిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రధా న మార్గాలు, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్ల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మ్యాన్‌హోల్‌లో పడి పిల్లలు మృతిచెందిన ఘటనలను చూశామని.. రామంతాపూర్‌లో విద్యుత్తు షాక్‌తో ఆరుగురు మృతిచెందారని ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగాయన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆర్టీసీ కార్మికుల్లో కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. కాంగ్రెస్‌ సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూనే మరోవైపు బస్సు చార్జీలు పెంచిందని విమర్శించారు. బస్‌ చార్జీలు పెంచి సామాన్యులు, పేదలపై భారం మోపడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు. ఇటీవల నగరంలో ముస్లిం ఖబ్రస్థాన్‌ ఏర్పాటుకు రక్షణ శాఖ భూములను కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయని.. ఇది దారుణం అని అన్నారు. కాగా.. రాంచందర్‌రావు, శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీలో మరికొంత మందికి అవకాశం కల్పించే అంశంపై ఆయన, జాతీయ నాయకత్వం అనుమతి కోరనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. కాగా, జుబ్లీహిల్స్‌ అభ్యర్థికి సంబంధించి ముగ్గురి పేర్లతో రాష్ట్రపార్టీ, జాతీయ నాయకత్వానికి జాబితాను నివేదించింది. లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్‌ పద్మ వీరపనేనిల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థిని ఆదివారం ప్రకటించనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.


రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఏది?

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ అసలు రంగు బయటపడిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షడు లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీసీ రిజర్వేషన్ల పట్ల ఏమాత్రం చిత్తశుద్థి లేదని మరోసారి రుజువైందన్నారు. రిజర్వేషన్ల అంశం న్యాయసమీక్షకు వెళుతుందని తెలిసినా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది, సీఎం రేవంత్‌ రెడ్డిదేనని పేర్కొన్నారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ మాటిచ్చిందని.. ఎందుకు అమలు చేయలేకపోతున్నారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పేరు పెడతామని హామీ ఇచ్చారని.. ఆ మేరకు జిల్లా పేరును ఎందుకు మార్చడం లేదని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Oct 11 , 2025 | 02:54 AM