Funding Shortage: నిధుల్లేవు.. నియామకాల్లేవు..చేసేందుకు పనుల్లేవు!
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:23 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తాము ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామని ఉప కులపతులు (వైస్ చాన్సలర్లు) ఆవేదన వ్యక్తం చేశారు.
14 నెలలుగా ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం
బడ్జెట్‌లో విద్యాశాఖకు 10శాతం ఇవ్వాలి
ఉన్నత విద్యామండలికి వర్సిటీల వీసీల మొర
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తాము ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామని ఉప కులపతులు (వైస్ చాన్సలర్లు) ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియామకాలు జరిగి 14 నెలలైనా నిధులు, నియామకాలు లేక వర్సిటీలను మెరుగుపర్చే చర్యలేమీ చేపట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. వర్సిటీల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐటీహెచ్‌ఎం)లో ప్రభుత్వ వర్సిటీ వీసీల వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీసీలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. నిధుల సమస్యతో వర్సిటీల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నామని చెప్పారు. ఇప్పటికే భారీగా బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలు ఉన్నాయని, పదవీ విరమణలతో ఖాళీలు మరింతగా పెరుగుతున్నాయని వివరించారు. కొత్త నియామకాలు లేక ఉన్నత విద్య నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. వెంటనే బోధన సిబ్బంది ఖాళీల భర్తీ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే బడ్జెట్‌లో విద్యా రంగానికి 10శాతం కేటాయించాలని కోరారు. వర్సిటీల హేతబద్ధీకరణకు.. యూజీ, పీజీ పాఠ్యాంశాల రూపకల్పనకు కమిటీలను నియమించాలన్నారు. వర్సిటీలకు కనీసం రూ. 100 కోట్ల చొప్పున అయినా కేటాయించాలని వీసీలు కోరారు. కొత్త విద్యా విధానంపై ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీలో ఐఏఎస్ అధికారులే ఉన్నారని.. వర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లకు చోటు కల్పించలేదని, ప్రభుత్వం తమను విస్మరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయుతే సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు. కాగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిగ్రీ, పీజీలలో ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.