Share News

Bathukamma Festival: చిత్తూచిత్తూల బొమ్మ.. శివునీ ముద్దులగుమ్మ

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:19 AM

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల, గులాబీ, బంతి పూలతో అందంగా పేర్చిన ఎంగిలి పూల బతుకమ్మల చుట్టూ..

Bathukamma Festival: చిత్తూచిత్తూల బొమ్మ.. శివునీ ముద్దులగుమ్మ

  • రాష్ట్రవ్యాప్తంగా మొదలైన బతుకమ్మ పండగ

  • ఎంగిలిపూల బతుకమ్మల వద్ద మహిళల సందడి

  • ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఘనంగా వేడుక

  • కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి,

  • మంత్రులు కొండా సురేఖ, సీతక్క

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల, గులాబీ, బంతి పూలతో అందంగా పేర్చిన ఎంగిలి పూల బతుకమ్మల చుట్టూ.. ఏమేమీ పువ్వోప్పునే గౌరమ్మా.. ఏమేమీ కాయొప్పునే..!!, బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... అంటూ ఆడి, పాడిన మహిళా లోకం తొమ్మిది రోజులు పాటు సాగే బతుకమ్మ వేడుకలకు ఆదివారం అట్టహాసంగా శ్రీకారం చుట్టింది. పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో పండగ శోభ సంతరించుకోగా.. ఎక్కడికక్కడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్‌ వేయి స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ(సీతక్క), కొండా సురేఖ, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌ వెన్నెల, సంగీత నాటక అకాడమి చైర్‌పర్సన్‌ అలే ఖ్య తదితరులు పాల్గొన్నారు. వేయి స్తంభాల గుడి వద్దకు బతుకమ్మలతో వచ్చిన మంత్రులు సీతక్క, సురేఖ.. ఆ తర్వాత మహిళలతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడారు. వేయి స్తంభాలు గుడి పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.


ఇక, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతీలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో బహుజన బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. బహుజన బతుకమ్మ వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క ఈ వేడుకలో పాల్గొన్నారు. గ్రామంలో అమరులైన సంజీవ్‌, జాన్సన్‌, అక్తర్‌, కనకయ్యను వేడుకలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గుర్తు చేసుకుని ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇక, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.


బతుకమ్మను కాదని యూరియా కోసం క్యూకట్టి

ఖానాపురం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. బతుకమ్మ అంటేనే ఆడవారి పండుగ. అలాంటిది వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మహిళలు మాత్రం బతుకమ్మ పండుగను పక్కనపెట్టి మరీ యూరియా కోసం క్యూలు కట్టారు. గ్రామానికి సోమవారం ఉదయం యూరియా వస్తుందని, టోకెన్లు ఇస్తామని వ్యవసాయాధికారులు గ్రామ వాట్సాప్‌ గ్రూపులో ఆదివారం రాత్రి ఓ మెసేజ్‌ పెట్టారు. అంతే, అప్పటిదాకా బతుకమ్మ ఆడుతూ సందడిగా గడిపిన మహిళలంతా ఆటపాటలను ఎక్కడికక్కడ ఆపేసి యూరియా టోకెన్ల కోసం గ్రామంలోని ఎరువుల గోదాము వద్ద రాత్రి తొమ్మిది గంటలప్పుడు క్యూకట్టారు.

Updated Date - Sep 22 , 2025 | 05:20 AM