Rosaiah Memorial Award: అందరివాడు రోశయ్య
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:48 AM
పార్లమెంటులో సభ్యుల భాష మంచిగా అనిపించడం లేదని, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వీహెచ్ అన్నారు. ప్రతిపక్ష నేతలను దూషించకుండా....
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
వీహెచ్‌కు రోశయ్య స్మారక పురస్కారం ప్రదానం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో సభ్యుల భాష మంచిగా అనిపించడం లేదని, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ప్రతిపక్ష నేతలను దూషించకుండా, హుందాగా విమర్శను వ్యక్తం చేయడంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆదర్శనీయుడని, ఆయన అందరివాడు అని కొనియాడారు. రోశయ్యను ముఖ్యమంత్రిగా కొందరు వ్యతిరేకించిన సమయంలో తాను ఆయన పక్షాన నిలిచి మద్దతు పలికానని చెప్పారు. తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో రోశయ్య నాలుగో వర్థంతి సభ నిర్వహించారు. రోశయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని వీహెచ్ అభినందించారు. ఈ సందర్భంగా వీహెచ్‌కు రోశయ్య స్మారక పురస్కారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతులమీదుగా ప్రదానం చేశారు. రోశయ్య వ్యక్తిత్వం ఈతరానికి స్ఫూర్తిదాయకమని పొన్నం అన్నారు. నూతన శాసన సభ్యులకు ఆయన ఒక మార్గదర్శిఅని ప్రసాద్ కుమార్ అన్నారు. రోశయ్య పెద్ద కుమారుడు శివ సుబ్బారావు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందజేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్య వైశ్యసంఘాల నేతలు హాజరయ్యారు. కాగా, రోశయ్య సేవలను ఏపీ ప్రభుత్వం విస్మరించిందని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రోశయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు.