Share News

Maoist leader Venugopal: లొంగుబాటు యత్నాల్లో వేణుగోపాల్‌!

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:13 AM

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోనూ పోలీసులకు లొంగిపోయే యత్నాల్లో ఉన్నారని....

Maoist leader Venugopal: లొంగుబాటు యత్నాల్లో వేణుగోపాల్‌!

  • పోలీసులకు కోవర్టుగా మారిన మావోయిస్టు అగ్రనేత.. దాంట్లో భాగంగానే ఇటీవల సాయుధ పోరాట విరమణ లేఖ

  • మావోయిస్టు నాయకత్వాన్ని బయటకు రప్పించి, మట్టుబెట్టే పోలీసుల వ్యూహంలో భాగమే ఇదంతా!

  • మాజీ మావోయిస్టుల విశ్లేషణలు

  • కోవర్టు కుట్ర ద్వారానే కడారి, కట్టా ఎన్‌కౌంటర్‌

  • ప్రజాసంఘాల ఆరోపణలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోనూ పోలీసులకు లొంగిపోయే యత్నాల్లో ఉన్నారని, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రజా సంఘాల ప్రతినిధులు, మాజీ మావోయిస్టులు అనుమానిస్తున్నారు. అయితే దీంట్లో వాస్తవం లేదని, మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు పేరిట జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడానికి ఏ స్థాయి మావోయిస్టులు వచ్చినా వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి, అభయ్‌, సోనూను విప్లవ ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ.. తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణం పార్టీకి అప్పగించాలని ఆయనను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయుధాలు అప్పగించకుంటే పీఎల్‌జీఏ (ప్రజా విముక్త గెరిల్లా సైన్యం) వాటిని స్వాధీనం చేసుకుంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేణుగోపాల్‌ భవితవ్యంపై అటు ప్రజాసంఘాలతోపాటు ఇటు పోలీసు వర్గాల్లోనూ చర్చ నెలకొంది.


లొంగుబాటు లాంఛనమే!

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్‌ పేరిట ఇటీవల మల్లోజుల వేణుగోపాల్‌ విడుదల చేసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయుధపోరును తాత్కాలికంగా విరమిస్తామని, దీనిపై సహచరులతో చర్చల కోసం నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ప్రస్థానంలో చోటుచేసుకున్న తప్పొప్పులనూ మరో లేఖలో విశ్లేషించారు. అంతేకాదు, ఓ లేఖ మీద తన ప్రస్తుత ఫోటోనూ జతపరిచారు. ఈ లేఖ వచ్చినపుడే ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులకు కోవర్టుగా మారిన క్రమంలోనే మల్లోజుల వేణుగోపాల్‌ ఇలాంటి లేఖను విడుదల చేశారని విమర్శలు వచ్చాయి. ఆపై మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ తరఫున జగన్‌ పేరిట విడుదలైన లేఖ ద్వారా.. వేణుగోపాల్‌ లేవనెత్తిన అంశాలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి సంబంధం లేదని వివరణ వచ్చింది. జగన్‌ లేఖ విడుదలై 48 గంటలు దాటకముందే.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కడారి సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి ఎన్‌కౌంటర్‌లో మరణించారని పోలీసులు ప్రకటించారు. వాస్తవానికి అభయ్‌ లేఖ తర్వాత పార్టీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి వీరిద్దరు సమావేశమై ఒక లేఖను రూపొందించారని, ఆ లేఖ మీడియాకు విడుదల కాకముందే ఎన్‌కౌంటర్‌లో మరణించారని తెలుస్తోంది. కోవర్టు ఆపరేషన్‌ ద్వారానే పోలీసులు వీరిద్దరినీ పట్టుకొని కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తదితర సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాయుధ పోరాటం విరమణ అంటూ అభయ్‌ పేరిట లేఖ విడుదలైతే.. మావోయిస్టు పార్టీ నాయకత్వం స్పందిస్తుందనే అంచనాతోనే పోలీసులు ఎత్తుగడ వేశారని అంటున్నారు. పార్టీ అగ్రనాయకత్వాన్ని బయటకు రప్పించడంలో భాగంగానే అభయ్‌ నుంచి లేఖ వచ్చి ఉంటుందని మాజీ మావోయిస్టులు అభిప్రాయపడుతున్నారు. మల్లోజుల వేణుగోపాల్‌ ఇప్పటికే పోలీసులతో టచ్‌లోకి వెళ్లి ఉంటారని, ఆయన లొంగుబాటు ప్రకటన లాంఛనమేనని వారు చెబుతున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 03:13 AM