Elections in a Ghost Village: జనంలేని ఊర్లో ఎన్నికల హోరు
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:24 AM
ఆ ఊర్లో ఇళ్లు కూలిపోయాయి. జనమే లేరు. అది ఊరని చెబితే కూడా ఎవ్వరూ నమ్మరు. అయినా అక్కడ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి...
మూడేళ్ల క్రితమే వెంకటేశ్ ఖని గ్రామం ఖాళీ.. పూర్తిగా పాడుబడి ఆనవాళ్లు కోల్పోయిన ఊరు
ఎప్పుడో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోకి ప్రజలు
183 ఓటర్లతో జాబితా.. రెండో విడతలో ఎన్నికలు
కొత్తగూడెం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆ ఊర్లో ఇళ్లు కూలిపోయాయి. జనమే లేరు. అది ఊరని చెబితే కూడా ఎవ్వరూ నమ్మరు. అయినా అక్కడ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలలో కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్న వెంకటేశ్ ఖని అనే గ్రామం గురించే ఇదంతా! 30 ఏళ్ల క్రితం ఈ ఊరు గ్రామ పంచాయతీగా ఏర్పడింది. సింగరేణి ఓపెన్‌కా్‌స్ట పీవీకే-5 కోల్‌మైన్ విస్తరణలో భాగంగా 2022లో ఈ గ్రామంలోంచి ప్రజలను ఖాళీ చేయించారు. మొత్తంగా 79 బాధిత కుటుంబాలను గుర్తించి కొత్తగూడెం కార్పొరేషన్ 5వ వార్డు పరిధిలోని గంగాబిషన్ బస్తీలో ఇంటిస్థలాలను కేటాయించారు. బాధితుల్లో కొందరు కార్పొరేషన్ పరిధిలోని అద్దె ఇళ్లలో నివసిస్తుంటే, ఇంకొందరు తమకు కేటాయించిన స్థలాల్లోనే రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్నారు. వెంకటేశ్ ఖని గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకున్నా గ్రామ పంచాయతీ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఊర్లోని జనం కార్పొరేషన్ పరిఽధిలోకి వెళ్లినా ఓట్లు మాత్రం ఆ ఊరి పరిధిలోనే ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో వెంకటేశ్ ఖని పంచాయతీకి రెండోవిడతలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ పంచాయతీలో 183 ఓటర్లున్నారు. గ్రామాన్ని నాలుగు వార్డులుగా విభజించారు. సర్పంచ్ పదవికి ముగ్గురు, వార్డుల్లో 10 మంది నామినేషన్లు వేశారు. ఎన్నికలు జరిగి.. ఎవరు గెలిచినా.. ప్రజలు లేని గ్రామాన్ని ఏం అభివృద్ధి చేస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.