VC Sajjanar Bids Farewell: నాలుగేళ్ల ఆర్టీసీ ప్రయాణం సంతృప్తినిచ్చింది
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:35 AM
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకు నాలుగేళ్లు సేవలు అందించడం సంతృప్తినిచ్చిందని, సమష్టికృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని మాజీ ఆర్టీసీ...
సమష్టి కృషితోనే వినూత్న కార్యక్రమాలు: వీసీ సజ్జనార్
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు నాలుగేళ్లు సేవలు అందించడం సంతృప్తినిచ్చిందని, సమష్టికృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని మాజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సోమవారం సజ్జనార్‌కు ఆర్టీసీ సంస్థ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకాలం తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సజ్జనార్ వీడ్కోలు తీసుకున్న సందర్భంగా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘నా స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు. కానీ రహదారి ఎళ్లప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. టీజీఎ్‌సఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్‌లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 రూట్ బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించారు.
నూతన ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు
వై.నాగిరెడ్డి ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూప్రజలకు మెరుగైన ప్రజా రవాణా అందించడమే కర్తవ్యమని తెలిపారు.