Telangana marked the 150th anniversary of Vande Mataram: స్వాతంత్య్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపిన వందేమాతరం
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:28 AM
స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వందేమాతరం భారతీయుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం...
భారతీయులకు సమర నినాదమైందన్న మంత్రులు పొన్నం, జూపల్లి
మహబూబియా స్కూల్‌లో వందేమాతరం సామూహిక గేయాలాపన
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వందేమాతరం భారతీయుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాల వేళ గన్‌ఫౌండ్రిలోని మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జూపల్లితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ నాడు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ వందేమాతరం సమర నినాదమైందన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రులు వందేమాతర గేయాలపన చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డీఈఓ రోహిణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి, ఆర్జెడి విజయలక్ష్మి పాల్గొన్నారు. వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాల సందర్భంగా డీజీపీ కార్యాలయంలో పోలీసు అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది వందేమాతరం గేయాన్ని ఆలపించారు. చార్మినార్ ఇన్‌చార్జీ డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్, శాంతిభద్రతల విభాగం ఏఐజీ రమణకుమార్, పరిపాలనా విభాగం ఏఐజీ నాగరాజు ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం గేయం దేశ ప్రజల్లో ఐక్యతను పెంచిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో 150 సంవత్సరాల ‘వందేమాతరం’ పేరిట ఏడాది పాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీవాస్తవ ప్రసంగించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకా్‌షతో పాటు పలువురు రైల్వే సీనియర్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
వందేమాతరం ఆలపించిన నూతన వధూవరులు
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి శ్రీవెంకటేశ్వర కల్యాణమండపంలో నూతన వధూవరులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. తమ వివాహ వేళ వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుగుతుండటంతో ప్రశాంత్, నిహారిక జంట బంధుమిత్రులతో కలిసి గేయాన్ని ఆలపించారు.