Share News

Uttam Kumar Reddy: ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకం

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:21 AM

ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Uttam Kumar Reddy: ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకం

  • సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తాం

  • కేసీఆర్‌, హరీశ్‌ది చిల్లర రాజకీయం

  • మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హుజూర్‌నగర్‌ , సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సీనియర్‌ న్యాయవాదులతో వాదిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రముఖ న్యాయవాదులతో కలిసి సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆల్మట్టి ప్రాజెక్టు సమీపంలో భూసేకరణకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేసిన కేసీఆర్‌, హరీశ్‌ రావు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చేస్తున్న చిల్లర రాజకీయం మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ నాయకులే డిజైన్‌ చేసి.. నాశనం చేశారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. కాగా, అంతకు ముందు చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ ఎత్తిపోతల పనులను, దొండపాడు వద్ద రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్‌ పరిశీలించారు. కృష్ణానదిలో చేపలు పడుతున్న జాలర్లతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు.

Updated Date - Sep 22 , 2025 | 06:23 AM