Uttam Kumar Reddy: 15 రోజుల్లోగా కాళేశ్వరం బ్యారేజీల..పునరుద్ధరణకు డిజైన్ కన్సల్టెంట్
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:07 AM
జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) సిఫారసుల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం 15 రోజుల్లోగా డిజైన్...
తక్కువ వ్యయంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
పునరుద్ధరణ పనులు చేపట్టాలి: ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) సిఫారసుల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం 15 రోజుల్లోగా డిజైన్ కన్సల్టెంట్ నియామకం పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో కాళేశ్వరం బ్యారేజీలతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై ఏం చేశారని నిర్మాణ సంస్థలను ఈ సందర్భంగా మంత్రి అడిగారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఆధారంగా.. వానాకాలానికి ముందు పరీక్షలు పూర్తయ్యాయని, వానాకాలం తర్వాత పరీక్షలు చేయాల్సి ఉందని నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ సామర్థ్యం తమ వద్ద లేదని, దీనికోసం డిజైన్ కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్మాణ సంస్థలు కోరగా... డిజైన్ కన్సల్టెంట్ నియామకం పూర్తి చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్‌ను మంత్రి ఆదేశించారు. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ నిర్మాణ ఖర్చును నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థయే భరించాలని స్పష్టం చేశారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం పక్కనపెట్టిన పనులను పునరుద్ధరించాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. తక్కువ వ్యయంతో బ్యారేజీతో పాటు కెనాల్, పంప్‌హౌస్ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాస్తవిక అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేయాలన్నారు.