Silent Blasting for SLBC Tunnel: శబ్దాలు లేకుండా ఒత్తిడితో టన్నెల్ తవ్వకం
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:38 AM
భారీ శబ్దాలు లేకుండా ఒత్తిడితో మట్టి/రాళ్లను తొలగించే పేలుడు పదార్థాలను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకంలో వినియోగించాలని...
అమెరికాకు చెందిన ఆటోస్టెమ్ పేలుడు పదార్థాల వినియోగం!
నెలపాటు ఉపరితలంపై ప్రత్యేక పరికరాలతో శబ్దాల రికార్డు
నవంబరు లేదా డిసెంబరులో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పునఃప్రారంభం
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భారీ శబ్దాలు లేకుండా ఒత్తిడితో మట్టి/రాళ్లను తొలగించే పేలుడు పదార్థాలను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకంలో వినియోగించాలని నిపుణులు భావిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో శ్రీశైలం వైపు ప్రమాదం జరిగి... పనులు ఆగిపోయిన విషయం విదితమే. టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) కూడా ధ్వంసమయింది. దాంతో ఇన్‌లెట్(శ్రీశైలం) వైపు టీబీఎం విడిభాగాలను బయటికి తెచ్చారు. ఔట్‌లెట్ (మన్నెవారిపల్లి, అచ్చంపేట) వైపు కూడా టీబీఎంతో తవ్వకాలు చేపట్టరాదని నిర్ణయం తీసుకొని... ఈ టీబీఎంను కూడా తొలగిస్తున్నారు. తాజాగా ఈనెలాఖరులోగా హెలికాప్టర్ ఆధారంగా జియో మ్యాగ్నటిక్ సర్వే పూర్తిచేసి, నవంబరు/డిసెంబరులో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం) విధానంలో టన్నెల్ తవ్వకాన్ని పునః ప్రా రంభించనున్నారు. ఈలోగా క్యాబినెట్‌లోనూ చర్చిం చి, దీనికి ఆమోదం తెలుపనున్నారు. డీబీఎం విధానంలో తవ్వకం జరిపే క్రమంలో తొలి నెలరోజులు అత్యంత అప్రమత్తంగా ఉండనున్నారు. అయితే పేలుడు పదార్థాలు వినియోగించి.. డీబీఎం విధానం లో తవ్వుతుంటే వెలువడే ధూళితో పాటు విషపూరిత పొగ వల్ల పలు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనా ఉంది. అయితే, ప్రస్తుతం పొగ, ఇతర ధూళిని బయటికి తీసుకెళ్లే వ్యవస్థలు ఉండటం వల్ల సమస్యలు రావనే భావనతో నిపుణులు ఉన్నారు. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వుతుంటే.. ఉపరితలంపై శబ్దాలు ఏ విధంగా ఉంటాయనే దాన్ని లెక్కించడానికి ప్రత్యేక పరికరాలు బిగించనున్నారు. ప్రత్యేక ఉపకరణాలతో నెలరోజులపాటు శబ్దాల తీవ్రతను తెలుసుకోనున్నారు. టన్నెల్ అంతా అమ్రాబాద్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉండటంతో ప్రత్యేక జాగ్రతలు తీసుకోనున్నారు. టన్నెల్ ఏ మార్గం నుంచి పోనుందనే సర్వే ఈ నెలాఖరులోగా పూర్తయితే ఇన్‌లెట్, ఔట్‌లెట్ వైపు భూఉపరితలంలో ప్రత్యేక పరికరాలు పెట్టనున్నారు.
అమెరికా నుంచి పేలుడు పదార్థాలు
శబ్దాలు లేకుండా ఒత్తిడితో రాళ్లు/రప్పలు/మట్టిని కదిలించి.. కిందపడేసే పేలుడు పదార్థాలను అమెరికాలోని ఆటోస్టెమ్ అనే కంపెనీ తయారు చేస్తోందని గుర్తించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకం పనులకు పునఃప్రారంభించడానికి క్యాబినెట్ ఆమోదించిన వెంటనే అమెరికన్ కంపెనీతో నిపుణులు సంప్రదింపులు జరుపనున్నారు. సొరంగం లోపల సురక్షితమైన పని వాతావర ణం ఉండేలా చూసుకోవడానికి అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని నీటిపారుదలశాఖ అధికారి ఒకరు తెలిపారు. హెలికాప్టర్ సర్వే పూర్తయ్యాక సొరంగం వెళుతున్న దారిలో భూమి ఏ విధంగా ఉంది...? ఏయే రాళ్లు అడ్డం రానున్నాయనే సమాచారం రానుందని, దీనిఆధారంగా టన్నెల్ పనులను పూర్తిచేస్తామని టన్నెలింగ్ రంగ నిపుణులు పేర్కొన్నారు.