kumaram bheem asifabad- రైతులకు యూరియా కష్టాలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 10:33 PM
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేదు. అదను దాటుతున్నా యూరియా బస్తాలు అందక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడ్డప్పటికీ ఒక్క బస్తా యూరియా దొరకక అవస్థలు పడుతున్నారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌కు యూరియా బస్తాలు రావడంతో వ్యవసాయాధికారులు యూరియా పంపిణీ చేపట్టారు
బెజ్జూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేదు. అదను దాటుతున్నా యూరియా బస్తాలు అందక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడ్డప్పటికీ ఒక్క బస్తా యూరియా దొరకక అవస్థలు పడుతున్నారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌కు యూరియా బస్తాలు రావడంతో వ్యవసాయాధికారులు యూరియా పంపిణీ చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో ఇది ఏ మాత్రం సరిపోవని ఆగ్రహం వ్య్తం చేశారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఎస్సై సర్ధాజ్ పాషా ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులకు షామియానాలు, మంచినీటి వసతి ఏర్పాటు చేశారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): యూరియా బస్తా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. అదను దాటి పోతున్నా వర్షాలు కురిస్తే ఎరువులు వేసుకోవచ్చని రైతులు యూరియా కోసం బారులు తీరారు. రైతులకు ఒకటి లేదా రెండు చొప్పున బస్తాలు ఇవ్వడంతో ఆవేదన చెందుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యూరియా బస్తాల కోసం తిరుగుతున్నామని వాపోతున్నారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో 888, బీబ్రా ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 333, గిరివెల్లి రైతు వేదిక వద్ద 88 యూరియా బస్తాల పంపిణీ చేసిపట్లు ఏఓ రామకృష్ణ తెలిపారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఎస్సై విక్రమ్ ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీవో బక్కయ్య, ఏఈవోలు వంశీ, లావణ్య, రోహిణి, ఆనంద్‌రావు, సాయి, జీవన్, నరసింహ పాల్గొన్నారు.