Share News

Urea Shortage: యూరియా వచ్చింది సగమే

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:49 AM

వానాకాలం పంటల సాగుకు సరిపడా రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది..

Urea Shortage: యూరియా వచ్చింది సగమే

  • అరకొరగా సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

  • ఖరీఫ్‌ సీజన్‌కు 9.80 లక్షల టన్నులు అవసరం

  • ఇప్పటివరకు వచ్చింది 5.32 లక్షల టన్నులే

  • యూరియా సరఫరాలో కేంద్రం విఫలం: సీఎలీ

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగుకు సరిపడా రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలంలో 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే రాష్ట్రానికి వచ్చింది. అంటే నిర్ణీత కోటాలో సగం యూరియా మాత్రమే రాష్ట్రానికి చేరింది. దీంతో రైతులకు సరిపడా యూరియా అందడంలేదు. రాష్ట్ర అవసరాలు, కేటాయింపులకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్రం నుంచి ఆశించిన మేరకు యూరియా రావడంలేదు. ఈ సీజన్‌లో ఆగస్టు వరకు కేటాయింపులు 8.30 లక్షల టన్నులుగా ఉంది. కానీ, ఇపట్పివరకు జరిగిన సరఫరాతో పోలిస్తే ఇంకా 2.98 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడింది. దీనికితోడు రాష్ట్రంలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ నుంచి ఆశించిన స్థాయిలో యూరియా ఉత్పత్తి కావడంలేదు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 145 పనిదినాలు ఉంటే.. 78 రోజులు రామగుండంలో యూరియా ఉత్పత్తి జరగలేదు. ఇటు స్థానికంగా ఉత్పత్తి సరిగా లేకపోవడం, అటు కేంద్రం నుంచి కోటా ప్రకారం రావాల్సిన యూరియా రాకపోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడింది. ఈ వానాకాలం పంటలు గట్టెక్కాలంటే ఇంకా 4.50 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది.


యూరియా సరఫరాలో కేంద్రం విఫలం: సీఎల్పీ

తెలంగాణకు కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెంకటరమణారావు, మక్కన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, భూపతిరెడ్డి ఆరోపించారు. సీఎల్పీ మీడియా హాల్లో వారు సమావేశంలో మాట్లాడారు. యూరియా కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏమీ చేయలేక పోతున్నారని, రాష్ట్రంలో రైతుల కష్టాలకు బీజేపీదే బాధ్యత అని అన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు దమ్ముంటే యూరియా కోసం ప్రధాని మోదీని నిలదీయాలని, ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. యూరియా పేరుతో డ్రామాలు ఆడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నేతలను ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు.

Updated Date - Aug 19 , 2025 | 03:49 AM