Urea Shortage: యూరియా కోసం ఆగని ఆందోళనలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:27 AM
రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు..
పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు.. అందనిచోట ధర్నాలు, రాస్తారోకోలు.. యూరియా పంపిణీ పర్యవేక్షణలో నిర్లక్ష్యం
ఆత్మకూర్(ఎస్) మండల ఏవో సస్పెన్షన్
2 యూరియా బస్తాలిచ్చి 5 ఇచ్చినట్లు స్లిప్
నెమ్మికల్ పీఏసీఎ్‌సలో సిబ్బంది మోసం
ఫిర్యాదుతో సూర్యాపేట కలెక్టర్ చర్యలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కానీ యూరియా అందకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. మంగళవారం కరీంనగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను, రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, ఓదెలలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్య, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తన్‌పల్లి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు కేంద్రాల వద్ద అలజడి రేగింది. పెద్దనాగారం క్లస్టర్ రైతులు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. తమకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో సత్యనారాయణ అనే యువరైతు తెల్లవారుజామునే వచ్చి గంటల తరబడి లైన్‌లో సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో క్యూ లైన్‌లో ఇద్దరు మహిళా రైతుల మధ్య మాటామాటా పెరిగి చెప్పులతో కొట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కూడా రాస్తారోకో చేశారు. దౌల్తాబాద్‌లో రైతులు అర్ధరాత్రి నుంచే పడిగాపులు పడ్డారు. క్యూలో చెప్పులు, వరిగుజ్జు కట్టలు, మందు బాటిళ్లు పెట్టారు. వికారాబాద్ జిల్లా యాలాల మండల రైతులు హైవేపై బైఠాయించారు. యూరియా పంపిణీ పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఆత్మకూరు(ఎస్) మండల వ్యవసాయ అధికారి దివ్యను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు. నెమ్మికల్ పీఏసీఏస్ సిబ్బంది తనకు 5 బస్తాల యూరియా అందజేసినట్లు స్లిప్ ఇచ్చి 2 బస్తాలే ఇవ్వడంతో ఓ రైతు కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా చాలామంది రైతులను మోసం చేస్తున్నారని తెలిపాడు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తనిఖీ చేసి.. అవకతవకలు జరిగినట్లు గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.