Sarpanch Candidates: ఊరికి రండి... ఓటేయండి!
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:19 AM
గ్రామపంచాయతీ ఎన్నికల పోరు పోటాపోటీగా మారిన నేపథ్యంలో.. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఓటర్లను స్వగ్రామాలకు...
ఓటర్లకు అభ్యర్థుల విజ్ఞప్తులు
ఖర్చులతోపాటు వాహనాల ఏర్పాటు
వరుస సెలవులతో జనం పల్లెబాట
బస్టాండ్లు, జిల్లాల రోడ్లు కిటకిట
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల పోరు పోటాపోటీగా మారిన నేపథ్యంలో.. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు సర్పంచ్ అభ్యర్థులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ‘ఓటర్ల జాబితాలో మీకు ఓటు ఉంది. దయచేసి ఊరికి వచ్చి ఓటేయండి!’ అని అభ్యర్థిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న లక్షలాది మందికి సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉంది. పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరిగింది. వారం మధ్యలో కావడంతో హైదరాబాద్ నుంచి స్వల్ప సంఖ్యలోనే వెళ్లారు. కానీ, రెండో విడత పోలింగ్ ఆదివారం ఉండటంతో చాలామంది గ్రామాలకు ప్రయాణమయ్యారు. మొదటి విడతలో స్వల్ప ఓట్ల తేడాతో కొన్ని సర్పంచి స్థానాలు కోల్పోవటం, ఓటింగ్‌శాతం పెద్దగా నమోదు కాకపోవటంతో ప్రధాన రాజకీయపార్టీలు రెండో విడతలో ఈ అంశంపై దృష్టి పెట్టాయి. పోలింగ్ 90 శాతం దాటేలా చూడాలని సర్పంచి, వార్డు స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులకు లక్ష్యం నిర్దేశించాయి. ఈ క్రమంలో కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఏకంగా ఆయా పట్టణాలకు వచ్చి ఓటర్లను స్వయంగా కలిసి వెళ్తుండగా... మరికొందరు ఫోన్లలో మాట్లాడి వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. రాకపోకలకు ఖర్చులు సైతం సర్దుబాటు చేస్తున్నారు. మరికొందరు ఊరికి రాగానే డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. శనివారం సొంతూళ్లకు ఓటర్లను తీసుకువెళ్లడంతో ఆదివారం ఎన్నికల ముగిసిన అనంతరం రాత్రివరకు నగరంలోని తమ ప్రాంతాల్లో దించేలా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వెళ్తున్న వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఖర్చులు పోగా ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్, ఉప్పల్, ఎల్‌బీనగర్ బస్టాప్‌ల్లో భారీ రద్దీ నెలకొంది. ఆర్టీసీ సైతం వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
అయితే, రద్దీకి తగినట్లు బస్సులు లేకపోవడంతో మహిళలు బస్టాండ్లలో పడిగాపులు కాశారు. కాగా, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వేల మంది యువత కార్లు, బైకులపై గ్రామాల బాటపట్టారు. ఆదివారం సెలవు కావడంతో ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం దొరికిదంటూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరంఘర్, మెహిదీపట్నం, మియాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం నెలకొంది. ఒకవైపు జిల్లాలకు వెళ్లే దారులపై వాహనాలతో రద్దీ ఏర్పడింది.