Share News

NIA Investigation: అర్బన్‌ నక్సల్స్‌పై ఉక్కుపాదం

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:45 AM

వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్‌ నక్సల్స్‌పై దృష్టి సారించిందా!

NIA Investigation: అర్బన్‌ నక్సల్స్‌పై ఉక్కుపాదం

  • వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

  • తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు

  • నక్సల్స్‌కు ఆర్థిక, వైద్య, సమాచార సాయంపై దృష్టి

  • సోషల్‌ మీడియాపై ఎన్‌ఐఏ ఆరా.. రాబోయే రోజుల్లో అరెస్టులు?

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్‌ నక్సల్స్‌పై దృష్టి సారించిందా!? కేంద్రం పిలుపునకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే.. మరోవైపు యువతను అర్బన్‌ నక్సల్స్‌ మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిందా!? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోందని అనుమానిస్తోందా?ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అందుకే, రాబోయే రోజుల్లో అర్బన్‌ నక్సల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని తెలిపాయి. అర్బన్‌ నక్సల్స్‌, వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఆర్పీఎ్‌ఫకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిర్దేశించారని గుర్తు చేశారు. నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, ఆర్థిక, న్యాయ సహాయం అందిస్తున్న వారిని గుర్తించి, చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజమనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్‌ షా వ్యాఖ్యానించారని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే, నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో అర్బన్‌ నక్సల్స్‌ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం.. వారి కదలికలపై నిఘా పెంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురి సోషల్‌ మీడియా అకౌంట్లపై ఎన్‌ఐఏ అంతర్గత విచారణ జరిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్‌ నక్సల్స్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిజానికి, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిసా తదితర రాష్ట్రాలు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైనా.. తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్‌ నక్సల్స్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.


మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, ఇంటెలిజెన్స్‌ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. మావోయిస్టులకు అవసరమైన వనరుల సేకరణలోనూ మరికొంతమంది క్రియాశీలంగా ఉన్నారని గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో మావోయిస్టు సానుభూతిపరులను పెంచుతున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తోంది. తమ సోషల్‌ మీడియా ఖాతాలను మావోయిస్టు అనుకూల ప్రచారానికి వేదికగా మార్చుకున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జన జీవన స్రవంతిలో కలుస్తుంటే.. మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరు వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది. ఇక, మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఇటీవల జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్య.. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం దిశగా ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో ఉపా చట్టం కింద ఎన్‌ఐఏ ఆయనను అరెస్టు చేసింది. అలాగే, మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత జరిగిన ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్‌ నక్సల్స్‌.. ఆయనను దేశభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని గుర్తించింది.


అలాంటి వారి వివరాలను ఎన్‌ఐఏ సేకరిస్తోంది. ఒడిసాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌ జిల్లాకు చెందిన గణేశ్‌ అనే మావోయిస్టు చనిపోయాడు. ఆయనకు మద్దతుగా సోషల్‌ మీడియా వేదికగా ఎవరెవరు ఎలా స్పందించారన్న విషయాన్ని కూడా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే అర్బన్‌ నక్సల్స్‌ పని చేస్తున్నట్లు గుర్తించిందని తెలిపాయి. దాంతో, వారి సోషల్‌ మీడియా ఖాతాలపై ఎన్‌ఐఏ అంతర్గత విచారణ చేపట్టింది. మావోయిస్టులకు మద్దతుగా రాష్ట్రంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు? ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చారు? మావోయిస్టులను వారు నేరుగా కలుసుకున్నారా? వంటి అంశాలను ఆరా తీస్తోంది. వారి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి వాటిపై లోతైన దర్యాప్తు చేస్తోంది. మావోయిస్టు అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తేలితే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తథ్యమని ఆ వర్గాలు వివరించాయి.

Updated Date - Dec 28 , 2025 | 05:47 AM