Union Minister Bandi Sanjay: మావోయిస్టులూ.. అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మొద్దు
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:54 AM
మీ చావుకు అర్బన్ నక్సల్సే కారకులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్న అర్బన్ నక్సల్స్ మాయలో పడి ప్రాణాలు కోల్పోవద్దు....
మీ అందరి చావుకు వాళ్లే అసలు కారకులు: సంజయ్
సిరిసిల్ల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘మీ చావుకు అర్బన్ నక్సల్సే కారకులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్న అర్బన్ నక్సల్స్ మాయలో పడి ప్రాణాలు కోల్పోవద్దు’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మావోయిస్టులకు సూచించారు. ‘తుపాకీతో అసలు మీరు సాధించేదేమిటి? తుపాకీ పట్టుకుంటే క్షమించే ప్రసక్తే లేదు. కలం పట్టి చదువుకునే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు ఇచ్చి అడవుల్లోకి పంపితే... వారు తిండితిప్పలు లేక తిరుగుతున్నారు. దేశ సరిహద్దులో జTEవాను వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలి. తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలి’ అని పిలుపునిచ్చారు. మంగళవారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి 4 నెలల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ‘మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందే.. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే.. అలా వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది’ అని అన్నారు.