Panchayat Elections: గెలుపు కోసం కలిసిపోదాం!
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:01 AM
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకతీతంగా ప్రత్యేక గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు బలాబలాలను ప్రదర్శిస్తున్నాయి.....
‘పంచాయతీ’ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు
అత్యధిక స్థానాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల జట్టు
కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు
మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల నడుమ కూడా
సిద్ధాంతాలను పక్కనపెట్టి, ‘పంచాయతీ’ గెలుపు కోసం దోస్తీ
ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకతీతంగా ప్రత్యేక గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు బలాబలాలను ప్రదర్శిస్తున్నాయి. ఎలా గెలిచామన్నది కాదు గెలవడమే ముఖ్యమన్న రీతిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాము మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి.. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఫార్ములాను గట్టిగా వాడేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఊహించని అవగాహనలు, ఆసక్తికర పొత్తులు పొడుస్తున్నాయి. సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెడుతున్న పార్టీలు.. అందివచ్చిన పార్టీలు, అభ్యర్థులతో సయోధ్య కుదుర్చుకుంటున్నాయి. సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలను పంచుకొని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై లెక్కలు వేసుకొని మరీ జట్లు కడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవుతున్నాయి. అధికార కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్‌ఎస్ చాలా ప్రాంతాల్లో కలిసి తలపడుతున్నాయి, ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెడుతున్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణులు ఒక్కటైపోతుండడం మరింత విడ్డూరం. రాజకీయ పార్టీల ఈ స్నేహం చాలావరకు బహిరంగంగానే జరుగుతుంది. తాము బలపరిచే అభ్యర్థికి మద్దతుగా వేర్వేరు పార్టీలకు చెందిన వ్యక్తులు కలిసి ప్రచారమూ చేస్తున్నారు. కొన్నిచోట్ల అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్న పార్టీలు ప్రత్యర్థికి పరోక్షంగా సహకరిస్తున్నాయి.
ఆసక్తి రేపుతున్న పొత్తులు
మహబూబాబాద్ జిల్లాలోని నాయకపల్లి, బ్రహ్మణపల్లి, మచ్చర్ల పంచాయతీల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. గార్ల పంచాయతీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ములుగు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం ఒక్కటయ్యాయి. జిల్లాలోని పస్రా, గోవిందరావుపేట పంచాయతీల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఏటూరునాగారం మండలంలో బీఆర్‌ఎ్‌సకు సీపీఎం, తాడ్వాయి మండలం నార్లాపూర్‌లో బీఆర్‌ఎ్‌సకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల, రేగొండ మండలాల్లోని కొన్ని గ్రామాల్లోని బీజేపీ నేతలు బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలు పంచుకుని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటైనట్లు ప్రచారం ఉంది. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఎమ్మార్పీఎస్‌కు చెందిన బిర్రు సునితను సర్పంచ్‌గా బలపరుస్తున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి, కక్కిరాలపల్లి పంచాయతీల్లో బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు లోపాయికారి సయోధ్యతో పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో చాలాచోట్ల బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతిస్తున్న బీజేపీ శ్రేణులు కొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కోటకొండ, అభంగాపూర్, తిర్మలాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీజేపీ మద్దతు ఇస్తోంది. కోటకొండలో సీపీఐఎంఎల్ మాస్‌లైన్‌తో కాంగ్రెస్, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, ఆత్మకూరు, మదనాపూర్, అమరచింత, పాన్‌గల్, కొత్తకోట మండలాల్లోని పలు పంచాయతీల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఒకే అభ్యర్థితో నామినేషన్లు వేయించాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కడ్తాల, ఆమనగల్లు మండలంలోని మంగళపల్లి, శెట్టిపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించాయి. మేడిగడ్డ తండా, సాలార్‌పూర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని బలపరుస్తున్నాయి. కడ్తాల మండలం చరికొండలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి బీజేపీ మద్దతు పలుకుతోంది. షాద్‌నగర్ నియోజకవర్గంలో నామమాత్రంగా పోటీచేస్తున్న బీజేపీ.. స్థానిక పరిస్థితుల ఆధారంగా కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య సయోధ్య లేదు. కానీ తమ వారు పోటీలో లేని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ఇష్టం లేక పరస్పరం సహకరించుకుంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్ మద్దతివ్వగా, మిగిలిన చోట్ల బీఆర్‌ఎ్‌సతో బీజేపీ అవగాహన కుదుర్చుకుంది. ఉమ్మడి మెదక్‌లోని రాయపోల్, ఎల్కల్, మంతూరు గ్రామాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఒకే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వగ్రామం నకిరేకల్ నియోజకవర్గం బాహ్మణవెల్లంలలో సర్పంచ్ స్థానానికి ఆరుగురు బరిలో ఉండగా బీఆర్‌ఎస్ అభ్యర్థికి సీపీఎం మద్దతిచ్చింది. జగిత్యాల జిల్లాలో సీపీఎం, సీపీఐ కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎవరికి వారే అన్నట్టుగా ప్రధాన పార్టీల తీరు ఉంది. సిరిసిల్ల జిల్లాలో పార్టీల కంటే వ్యక్తుల ఆధారంగా మద్దతు తెలుపుతున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తీ!
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ రాష్ట్రంలోని పలు పంచాయతీల్లో సయోధ్యతో పని చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆయా పార్టీల నాయకుల మధ్య కుదిరిన అవగాహన వల్ల.. మండలంలోని సుభా్‌షనగర్, ధనియాలపాడు పంచాయతీలు ఏకగ్రీవం వైపు సాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొల్లాపూర్ నియెజకవర్గాల్లోని కొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పని చేస్తున్నాయి. పాలమూరు జిల్లా గండీడ్ మండలంలోని ఓ గ్రామంలో బీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్ మద్దతిస్తోంది. మహ్మదాబాద్ మండలంలోని వెంకట్‌రెడ్డిపల్లిలో గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు మద్దతివ్వగా, ఇప్పుడు బీఆర్‌ఎస్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. నారాయణపేట జిల్లా జిల్లాల్‌పూర్‌లో బీఆర్‌ఎస్ సర్పంచ్, కాంగ్రెస్ ఉపసర్పంచ్, వార్డుమెంబర్ పదవులు బీజేపీకి అని ఒప్పందం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని సర్వ, ఎలిగండ్లలోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు కలిసి పని చేస్తున్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని 22 గ్రామాల్లో కాంగ్రెస్ నుంచే ఇద్దరేసి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గ అభ్యర్థులకు బీఆర్‌ఎస్ మద్దతుగా నిలిచింది.