Damage Crops Across Telangana: అకాల వర్షం.. ఆగమాగం
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:59 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు...
మార్కెట్లలో తడిసిన పత్తి, మక్కలు.. అధికంగా తరుగు తీసి కొన్న వ్యాపారులు
పలు జిల్లాల్లో జోరు వాన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. కుండపోతగా వర్షం కురవడంతో చేతికొచ్చిన పంట నీటి పాలైంది. వరంగల్‌లో భారీ వర్షం ధాటికి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు, పత్తి, ఇతర సరుకులు తడిసిపోయాయి. ధరలు నిర్ణయించిన తరువాత వర్షం కురువడంతో రెండు గంటల పాటు కొనుగోళ్లను వ్యాపారులు నిలిపివేశారు. చివరకు క్వింటాల్‌కు 1-2కిలోల మేర అధికంగా తరుగు తీసి కొనుగోలు చేశారు. కేసముద్రం మార్కెట్ యార్డులోనూ రైతుల తీసుకొచ్చిన మక్కలు వరదలో కొట్టుకుపోయాయి. తేమ శాతం తగ్గేందుకు నాలుగైదు రోజులుగా ఆరబెట్టుకున్న మక్కలు తడిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి, పోతిరెడ్డిపేట, వెంకట్రావ్‌పల్లె, మానకొండూర్ మండలంలోని గంగాధర, గన్నేరువరం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం నీళ్లల్లో కొట్టుకుపోయింది. నాగర్‌కర్నూలులో వర్షం దంచికొట్టడంతో పలు కాలనీల రోడ్లు వాగులను తలపించాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 5.6, ఽనాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలో 4.43, తాడూరులో 3.95సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ వర్షం కురవగా ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. టీటీడీ కల్యాణ మండపం, మినీ పాలశీతలీకరణ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయ భవనంలోకి ఐదు రోజుల క్రితం వరద నీరు చేరుకోగా, మండల పరిషత్ కార్యాలయంలోకి రెండు రోజుల క్రితం వరద చేరి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్థానిక ఐకేపీ కేంద్రంలో 65 మంది రైతులకు చెందిన ధాన్యం రాశులు తడిసి ముద్దగా మారాయి. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఆరెగూడెం శివారులో పిల్లాయిపల్లి కాల్వకు గండిపడగా ఆ నీరు పంటపొలాల్లోకి చేరి 50 ఎకరాల్లో వరి చేను నీట మునిగింది.
పది రోజులుగా కాల్వ నుంచి నీరు లీక్ అవుతుండగా, నీటిపారుదల శాఖ డీఈ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారమందించినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడి జిల్లాలోని మహేశ్వరం, ఆమనగల్లు, మాడ్గుల, యాచా రం, ఇబ్రహీంపట్నం, చౌదరిగూడ, కేశంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట చేతికందే సమయంలో పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరలు, తదితర పంటలు నీట మునిగాయి. ఆమనగల్లు ఏపీజీవీబీ బ్యాంక్ ఎదుట, తహసీల్దార్ కార్యాలయ సమీపంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లేడ్ చౌదరిగూడ, కేశంపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా ధారూరు శివారులోని కుమ్మరి వాగు పొంగి పొర్లింది. పెద్దేముల్ మండలంలోని జైరాంతండా వద్ద కల్వర్టుపై నుంచి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో మంగళవారం పిడుగుపడి రైతు పూస మహిపాల్(40) మృతి చెందాడు.
ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద
గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. మంగళవారం గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 56 వేల క్యూసెక్కుల వరద రాగా... 56 వేల క్యూసెక్కులు దిగువకు వదిలిపెట్టారు. ఎల్లంపల్లికి 1.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. కృష్ణా బేసిన్‌లో జూరాలకు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... 28 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 41 వేలు, నాగార్జునసాగర్‌కు 39 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు 2278 టీఎంసీల వరద రాగా, ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి ఇదే అత్యధికం.