Share News

CM Revanth Reddy: రైతుల్ని సంఘటితం చేద్దాం

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:40 AM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ నరేగా)లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై రైతులను సంఘటితం చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు.

CM Revanth Reddy: రైతుల్ని సంఘటితం చేద్దాం

  • ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన

  • మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

  • గ్రామస్థాయిలో ‘ఉపాధి’ ఉద్యమం నిర్మిద్దాం

  • ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం

  • జీ రామ్‌జీ చట్టంతో రైతులు, కూలీలకు తీవ్ర నష్టం

  • సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • నరేగా రద్దు.. రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కోవడమే

  • పంచాయతీ వ్యవస్థను బలహీనపరిచే కుట్ర: రాహుల్‌

  • 5 నుంచి కాంగ్రెస్‌ ‘నరేగా బచావో’ ఉద్యమం

న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ నరేగా)లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై రైతులను సంఘటితం చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీ రామ్‌ జీ చట్టంతో జరిగే నష్టం గురించి పల్లెపల్లెకూ తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దామని సూచించారు. నరేగాకు మద్దతుగా గ్రామస్థాయిలో పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడదామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘నరేగా స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీ రామ్‌ జీ చట్టంతో దేశంలోని రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కోట్లాదిమంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడంతో గ్రామీణ పేదలు పని కోల్పోయే ప్రమాదముంది. నరేగాకు మద్దతుగా.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయని, వారందరినీ కలుపుకొని వెళుతూ నరేగాకు మద్దతుగా పెద్దఎత్తున ఉద్యమించాలని సూచించారు.


కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటర్లపై కుట్ర

కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేస్తోందని, పాత చట్టాలకు పాతరేస్తూ, కొత్త చట్టాలను రూపొందిస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పక్షాన నిలుస్తున్న దళితులు, గిరిజనులు, మైనార్టీలను టార్గెట్‌ చేస్తోందని, ఆయా వర్గాలు ఎన్నికల్లో పాల్గొనకుండా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌) పేరుతో గిరిజనులు, దళితులు, మైనార్టీలను టార్గెట్‌గా చేసుకుని వారి ఓట్లను తొలగిస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉండే వర్గాలను టార్గెట్‌గా చేసుకుని వారి ఓట్లను తొలగిస్తోంది. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుతోంది’’ అని మండిపడ్డారు. ఓట్‌ చోరీపై జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ చేసిన ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించిందని గుర్తు చేశారు. ఈ ఉద్యమంతో దళితులు, గిరిజనులు, మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీకి మరింత దగ్గరయ్యారని అన్నారు. సర్‌తో దళితులు, గిరిజనులు, మైనార్టీల్లో మద్దతు మరింత పెరిగినట్టే.. నరేగా ఉద్యమంతో రైతులు పూర్తిగా కాంగ్రెస్‌ పక్షాన చేరతారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనలను కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేతోపాటు మిగిలిన సభ్యులు ఆసక్తిగా విన్నారు.


సోనియా, రాహుల్‌తో రేవంత్‌ మాటామంతీ

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొంతసేపు ముచ్చటించారు. సీడబ్ల్యూసీ సమావేశం కోసం శుక్రవారం రాత్రికే ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లక్‌ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి నేరుగా బయలుదేరి శనివారం ఉదయం 10.30 గంటలకు ఇందిరా భవన్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడి ప్రవేశ ద్వారం వద్ద సోనియా గాంధీ కోసం రాహుల్‌ నిరీక్షిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి అక్కడికి వెళ్లగానే రాహుల్‌ గాంధీ ఆప్యాయంగా పలకరించారు. దాదాపు 10 నిమిషాలకు పైగా వారిరువురూ ముచ్చటించారు. అంతలోనే అక్కడికి సోనియా రావడంతో ఇద్దరూ ఎదురెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత మరో 5 నిమిషాలపాటు సోనియా, రాహుల్‌తో రేవంత్‌ రెడ్డి ముచ్చటించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఖాళీగా ఉన్న రెండు మంత్రివర్గ స్థానాలపై రాహుల్‌తో రేవంత్‌ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం.

Updated Date - Dec 28 , 2025 | 06:21 AM