Share News

Union Minister Kishan Reddy: బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి పరిమితులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:34 AM

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పరిమితులు, పరిధులు ఉంటాయని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

Union Minister Kishan Reddy: బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి పరిమితులు

  • మెట్రోను అడ్డుకుంటున్నాననే ఆరోపణల్లో వాస్తవం లేదు

  • మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పరిమితులు, పరిధులు ఉంటాయని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. అయితే.. బీసీలకు రిజర్వేషన్లు పెరగాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో తాము(బీజేపీ ఎమ్మెల్యేలు) ఓటు వేశామని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లపై కేంద్రం, గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి తెలంగాణ అభివృద్ధి పనులపై చర్చించిన అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌ వ్యవహారశైలి సరిగా లేదని ఈసందర్భంగా ఆయన విమర్శించారు. తనతోపాటు కేంద్రంలోని ఏ ఒక్కరూ మెట్రో విస్తరణకు అడ్డురావట్లేదని, ఇకనైనా రేవంత్‌ నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితబోధ చేశారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు, హైదరాబాద్‌ మెట్రో విషయంలో తామెప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు.. చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతాయని, కానీ రేవంత్‌ వాటికి జవాబు చెప్పేందుకు సిద్ధంగా లేరని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోందని.. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్రమే పరిష్కరించుకోవాలని సూచించారు. మెట్రో విషయంలో అన్ని రకాల సహాయ, సహకారాలూ అందించడానికి తాము సిద్థంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, గతంలోనూ కలిసి పనిచేశాయని, పదవులు పంచుకున్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.


ఇప్పుడు.. ఆ రెండు పార్టీలూ బీజేపీకి నీతులు చెప్పాలని చూడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ రెండు పార్టీలకూ బీజేపీ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. సీఎం రేవంత్‌ సహా ప్రతి ఒక్కరూ బీజేపీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఆధారాల్లేకుండా చిల్లర మాటలు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లపాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం కల్పించారని.. కానీ కాంగ్రెస్‌ పాలనతో రెండేళ్లు కాకముందే తలలు పట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాశేళ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను సీబీఐ పరిశీలిస్తోందని, అందులో రాజకీయ ప్రమేయమేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారులు..

రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభం కానున్నట్టు గడ్కరీ తనకు చెప్పారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ‘‘1,174 కిలోమీటర్ల మేర.. రూ.30,425 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు తెలంగాణలో జరగనున్నాయి’’ అని ఆయన వివరించారు. హైదరాబాద్‌-శ్రీశైలం రోడ్డు మార్గంలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం నాలుగు వరుసల ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Sep 26 , 2025 | 07:35 AM