Share News

Union Minister Kishan Reddy: ఆయుర్వేదానికి వ్యతిరేకంగా బహుళ జాతి కంపెనీల కుట్ర

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:11 AM

బహుళ జాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేదానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు..

Union Minister Kishan Reddy: ఆయుర్వేదానికి వ్యతిరేకంగా బహుళ జాతి కంపెనీల కుట్ర

  • ప్రాచీన వైద్య విద్యలను, యోగాను కాపాడుకోవాలి

  • 2014 తర్వాత ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరిగింది

  • భారత్‌ను గ్లోబల్‌ వెల్‌నెస్‌ కేంద్రంగా మార్చేందుకు కృషి

  • విశ్వ ఆయుర్వేద పరిషత్‌ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ,/బోరబండ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): బహుళ జాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేదానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆయుుర్వేదానికి వ్యతిరేకంగా ఒక లాబీ ప్రపంచంలో నడుస్తుందని, దీన్ని గట్టిగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సాంప్రదాయ వైజ్ఞానిక విద్యలను, యోగాను కాపాడుకోవాలని ఆయన సూచించారు. యూసుఫ్‌ గూడలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిమ్స్‌ మే ప్రాంగణంలో నిర్వహించిన విశ్వ ఆయుర్వేద పరిషత్‌ సదస్సు(వ్యాప్‌ కాన్‌- 2005)ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఆయుష్‌ శాఖ ద్వారా ఆయుర్వేదం, యోగాతోపాటుగా నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యం, హోమియోపతి వంటి వాటికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ప్రజల దైనందిన జీవితంలో ఆయుర్వేదాన్ని ఓ భాగంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. సిద్దిపేట, వికారాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసి యోగా, నేచురోపతి చికిత్స అందిస్తున్నామన్నారు. రామంతపూర్‌లోనూ ఇలాంటి ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి మార్గదర్శనం

వేల ఏళ్ల క్రితమే చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు వైద్యం, ఆపరేషన్లలో యావత్‌ ప్రపంచానికి మార్గదర్శనం చేశాయని కిషన్‌రెడ్డి తెలిపారు. తాను ఇంటర్‌మీడియట్‌ పూర్తయ్యే వరకు అలోపతి టాబ్లెట్‌ వేసుకోలేదని గుర్తు చేశారు. మోదీ ప్రధాని అయ్యాక 2014 తర్వాత ఆయుర్వేదానికి మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు. కరోనా సమయంలో పసుపు వినియోగం పెరగడం, తిప్పతీగ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడం వంటివాటిని ప్రపంచ వ్యాప్తంగా అనుసరించారని కిషన్‌ రెడ్డి చెప్పారు. భారత్‌ను గ్లోబల్‌ వెల్‌నెస్‌ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 05:11 AM