Union Minister Kishan Reddy: బీఆర్‌ఎస్, కాంగ్రెస్..రెండూ దగా పార్టీలే
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:53 AM
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ దగా పార్టీలేనని.. గద్దె ఎక్కకముందు ఒక మాట, గద్దెనెక్కాక మరో మాటగా ఆ పార్టీల వ్యవహారశైలి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు...
ప్రజలను మభ్యపెడుతున్నఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి
మజ్లిస్ మెప్పు కోసమే..మంత్రి పదవి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్ సిటీ,/ఎర్రగడ్డ, నవంబరు 1 (ఆంద్రజ్యోతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ దగా పార్టీలేనని.. గద్దె ఎక్కకముందు ఒక మాట, గద్దెనెక్కాక మరో మాటగా ఆ పార్టీల వ్యవహారశైలి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఒకరు పదేళ్లు మోసం చేస్తే.. మరొకరు రెండేళ్లుగా మభ్యపెడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నిక కేవలం ఒక అసెంబ్లీ స్థానానికో, హైదరాబాద్ నగరానికో పరిమితం కాదని.. యావత్ తెలంగాణను ప్రభావితం చేస్తుందని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. రహ్మత్‌నగర్, వినాయకనగర్, నవీన్‌నగర్, ఎస్పీఆర్ హిల్స్, ఇతర బస్తీల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లు అడిగే ముందు ఇక్కడ 2 గంటలు పాదయాత్ర చేయాలని, ప్రజలు ఏం చెబుతారో చూడాలని సవాల్ చేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రైనేజీ, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. మజ్లిస్ అసదుద్దీన్ కన్నుసన్నల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పనిచేస్తున్నాయని.. వారి మెప్పు కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు.