Union Minister Kishan Reddy : హిల్ట్ పేరుతోరేవంత్ భూ దందా
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:35 AM
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పు (హిల్ట్) విధానం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూదందాకు తెర తీశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు....
పారిశ్రామిక భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్
లక్షలాది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరం
హిల్ట్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పు (హిల్ట్) విధానం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూదందాకు తెర తీశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లబ్ధికే హిల్ట్ తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 22 పారిశ్రామికవాడల్లోని సుమారు 9 వేల ఎకరాల భూములను వాణిజ్య జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 తీసుకొచ్చిందని, ఇది అవినీతి జీవో అని విమర్శించారు. దీని వల్ల పారిశ్రామికవాడల్లోని లక్షలాది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. హిల్ట్‌లో భారీ స్థాయిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగనుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, ఆ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లలో బీఆర్‌ఎస్ రూ.10 లక్షల కోట్ల రుణాలతో అప్పుల కుప్పగా మారిస్తే.. రెండేళ్లుగా సీఎం రేవంత్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ తానే మేధావినని కాళేశ్వరం ప్రాజెక్టును గుదిబండగా మార్చారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో మరో కొత్త మేధావి వచ్చారని ఎద్దేవా చేశారు. రేవంత్ ఇష్టారీతిన భూములు అమ్మాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నేడు ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందించాలన్నా భూముల అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. భూములు అమ్మకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే తప్ప వెనక్కి తగ్గలేదన్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి హెచ్‌ఎండీఏ 2013లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ రైతుల పాలిట మాత్రం శాపంగా మారిందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేని కన్జర్వేషన్ జోన్ల కిందికి రైతుల భూములు రావడంతో వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుమతులు రావట్లేదన్నారు. తమ జోన్ మార్చాలని రైతులు ఏళ్లుగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు మాత్రం అడగకుండానే మార్చుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు.