Minister Bandi Sanjay: స్థానిక భాషల్లో.. సైబర్ మోసాలపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:07 AM
ఆన్‌లైన్, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. స్థానిక భాషల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి ..
అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. స్థానిక భాషల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (సీఐఎస్) కార్యకలాపాలను కేంద్ర మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4 సీ) ప్రాధాన్యాన్ని అధికారులకు వివరించారు. సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రధాన సమన్వయ కేంద్రంగా ఐ4 సీ పనిచేస్తోందని తెలిపారు. సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, 12 లక్షలకుపైగా మొబైల్ ఫోన్లు బ్లాక్ చేశామని, 13 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేశామని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. కాగా, సైబర్ నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చే నిబంధనలను సులభతరం చేయాలని అధికారులను సంజయ్ ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ భేటీ అయ్యారు. సోమవారం పార్లమెంట్‌లోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.