Underwater Drone Technology: సింగూరుకు అండర్ వాటర్ డ్రోన్ పరీక్షలు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:07 AM
పెను ప్రమాదంలో ఉన్న సింగూరు జలాశయానికి అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీతో పరీక్షలు నిర్వహించారు. డ్రోన్‌ను జలాశయం అట్టడుగు వరకు పంపించి నీటి కింద స్థితిగతులపై సెన్సార్లు...
జలాశయం అడుగున పరిస్థితులపై అంచనా
మరమ్మతుల కోసం నీటి నిల్వలను తగ్గించాలని సిఫారసు
ఈఎన్‌సీ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ భేటీ
ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఇవ్వనుండడంతో కాల్వలకు సైతం రూ.140 కోట్లతో లైనింగ్
హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): పెను ప్రమాదంలో ఉన్న సింగూరు జలాశయానికి ‘అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీ’తో పరీక్షలు నిర్వహించారు. డ్రోన్‌ను జలాశయం అట్టడుగు వరకు పంపించి నీటి కింద స్థితిగతులపై సెన్సార్లు, కెమెరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించనున్నారు. త్వరలో జలాశయానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో ఇది కీలకం కానుంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలకు సాగు, తాగునీరు సరఫరా చేసే సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆనకట్ట భద్రత సమీక్ష కమిటీ (డీఎ్‌సఆర్‌పీ) హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు, జలాశయానికి మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుసేన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై కీలక సిఫారసులు చేసింది. మరమ్మతులు చేపట్టేందుకు నీటిమట్టాన్ని 517.5 మీటర్లకు, నిల్వలను 8.17 టీఎంసీలకు తగ్గించేందుకు అనుమతించాలని సూచించింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 523.6 మీటర్లు, గరిష్ఠ నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు. ప్రస్తుతం 520.58 మీటర్ల నీటిమట్టం, 16.8 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. దీని ప్రకారం 8.63 టీఎంసీలను రోజుకు 0.3 మీటర్ల మేర కిందికి విడుదల చేస్తూ నీటిమట్టాన్ని తగ్గించాలని కమిటీ సూచించింది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టి.. మరమ్మతులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఇటీవల మరమ్మతులకు టెండర్లు పిలిచి.. రూ.13 కోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం చేసుకుంది. జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఇవ్వనుండడంతో కాల్వల లైనింగ్ పనులు చేపట్టేందుకు వీలు కలగనుంది. ప్రభుత్వం రూ.140 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనుంది. కాగా, ఒరిజినల్ డిజైన్ల ప్రకారం సింగూరు జలాశయం నీటిమట్టం 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. అయితే మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గించవద్దని 2017 అక్టోబరు 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది. కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి నిల్వలు కొనసాగిస్తుండడంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది.