Chevella Bus Tragedy Survivors: ఈ వేదన తీరనిది!
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:49 AM
అంతా నిర్వేదం. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడి బతికిపోయామన్న భావనే లేదు వారిలో! ఆ ఘోర ప్రమాదం తాలూకు జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. అంతకుమించి ఆప్తులను కోల్పోయిన బాఽధ గుండెలను మెలిపెడుతోంది.....
ప్రమాద ఘటన నుంచి తేరుకోలేకపోతున్న బాధితులు
ఆప్తులను కోల్పోయి కంటికీమంటికి ధారగా రోదనలు
సొంతూళ్లలో బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలు
తాండూరు/ బషీరాబాద్/ పెద్దేముల్/ యాలాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అంతా నిర్వేదం. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడి బతికిపోయామన్న భావనే లేదు వారిలో! ఆ ఘోర ప్రమాదం తాలూకు జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. అంతకుమించి ఆప్తులను కోల్పోయిన బాఽధ గుండెలను మెలిపెడుతోంది. కాస్త కునుకు పట్టినా ఉలిక్కిపడి లేస్తున్నారు. ఆ బస్సే ఎందుకు ఎక్కాం? ఎక్కకపోయి ఉంటే.. కుటుంబాలు ఛిద్రం కాకపోయి ఉండేవి కదా? ఇలా వారి మదిలో ఆలోచనల సుడిగుండాలు తిరుగుతున్నాయి. ముందురోజు రాత్రే వెళ్తామని ముగ్గురు కూతుళ్లు చెప్పినా, మర్నాడు పొద్దున్నే వెళ్లాలని తానే వాయిదా వేశానని, తాను అలా వాయిదా వేయకుండా ఉంటే బిడ్డలు బతికేవారు కదా? అనే పశ్చాత్తాపం అమ్మాయిలను కోల్పోయిన ఆ తల్లిలో కనిపిస్తోంది. నా భార్య, డ్రైవర్ వెనుక సీట్లో కాకుండా నేను కూర్చున్న సీట్లో కూర్చున్నా గాయాలతోనైనా బయటపడేదని మృతురాలి భర్త ఆలోచిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం తాలూకు విషాదం నుంచి బాధిత కుటుంబాలు ఎప్పుడు కోలుకుంటాయో తెలియదు. కానీ.. వారిలో ఎవ్వరిని కదిలించినా ఆప్తుల కోల్పోయిన బాధలో కంటికీమంటికి ధారగా రోదిస్తున్నారు. మంగళవారం ప్రమాద మృతుల అంత్యక్రియల సందర్భంగా సొంతూళ్లలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
ముందురోజే వెళ్లాల్సి ఉన్నా..
తనూష, సాయిప్రియ, నందిని.. తోబుట్టువులుగా కలిసి పెరిగి.. ఒకేమాట, ఒకేబాటగా ఉంటూ నిన్నటిదాకా తల్లిదండ్రుల ఆశాదీపాలుగా వెలుగొందిన ఈ అమ్మాయిలు వరుసగా మూడు పాడెల్లో అంత్యక్రియలకు తరిలారు. ఈ విషాద దృశ్యాన్ని చూసిన ఊరిజనం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వీరి అంత్యక్రియలు సొంతూరైన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం పేర్కంపల్లిలో జరిగాయి. బిడ్డలతో నిన్నటిదాకా ఉన్న జ్ఞాపకాలను తల్లిదండ్రులు అంబిక, ఎల్లయ్యగౌడ్ గుర్తుచేసుకొని భోరుమన్నారు. ఎంబీఏ చేస్తున్న తనూష మంచి చిత్రకారిణి కూడా. మదర్స్ డే సందర్భంగా తనూష.. తల్లి చిత్రాన్ని గీసి ఆమెకు గిఫ్ట్‌గా అందజేసింది. ముగ్గురు కూతుళ్లు కూడా హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరి పెద్ద సోదరి అనూష పెళ్లి గత నెల 17న జరిగింది. వేడుక సందర్భంగా తనూష, నందిని, సాయిప్రియ ఎంతో ఉత్సాహంగా కోలాటం ఆడారు. నృత్యాలు చేశారు. ఆ తర్వాత ముగ్గురూ హైదరాబాద్ వెళ్లిపోతే.. బంధువుల ఇంట పెళ్లి కోసం వారిని తల్లి ఇంటికి పిలిపించుకుంది.
అయితే, ఆదివారమే ఈ ముగ్గురూ హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. తల్లి ఒత్తిడి చేయడంతో వాయిదా వేసుకున్నారు. సోమవారం ఉదయం వారిని హైదరాబాద్ పంపించేందుకు తండ్రి ఎల్లయ్య గౌడ్ దగ్గరుండి ఆర్టీసీ బస్సు ఎక్కించాడు. ఓ రెండు నెలల తర్వాత తన చదువు అయిపోతుందని, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని.. అంతా కలిసి హైదరాబాద్‌లోనే ఉందామంటూ బస్సెక్కుతూ తనూష తండ్రితో చెప్పింది. ప్రతిగా అతడు.. తాను చేసిన అప్పులూ తీరిపోయాయని, హైదరాబాద్ వెళ్లి అక్కడే ఉందామంటూ కూతుళ్లతో చెప్పాడు. బస్సు కదులుతుండగా ‘డ్యాడీ మందులు వేసుకో.. బాగా చదువుకోవాలని తమ్ముడు మురళీకృష్ణకు చెప్పు’ అంటూ కూతుళ్లు చివరిమాటగా తండ్రితో చెప్పారు. ముగ్గురు కూతుళ్లు ఒకేసారి కడుపుకోత మిగిల్చారని.. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడినా.. వైద్యం చేయించి బతికించుకునేవాడినంటూ ఎల్లయ్యగౌడ్ రోదిస్తూ చెప్పాడు. హైదరాబాద్ నుంచి ముగ్గురు తోబుట్టువులు ఎప్పుడు వచ్చినా అదే గ్రామానికి చెందిన ముస్కాన్ బేగం వెంట వచ్చేది. ఆ ప్రమాదంలో వారి పక్కనే కూర్చోవడంతో ముస్కాన్ కూడా ప్రాణాలు కోల్పోయింది.
నాతో పాటు కూర్చుని ఉంటే ఆమె బతికేది
ఇది ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ అబ్డుల్ మాజీద్ మాట. ఆయనకు భార్య తబస్సుమ్ బేగం, పిల్లలు మజీన్, ముక్రమ్, కుమార్తె మైపాష్ జహాన్ ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు మాజీద్.. ఆమెతో పాటు పిల్లలను వెంటబెట్టుకొని బస్సెక్కాడు. ప్రమాదంలో తబస్సుమ్ ప్రాణాలు కోల్పోగా.. మాజీద్, పిల్లలు బయటపడ్డారు. తబస్సుమ్ డ్రైవర్ వెనుక సీట్లో కూర్చుంది. మధ్య సీట్లో కుమారులు, కుమార్తెతో కలిసి మాజీద్ కూర్చున్నాడు. వెనుక సీట్లో కూర్చొని ఉంటే తన భార్య బతికేదంటూ మాజీద్ కన్నీటిపర్యంతమయ్యాడు. చిన్న కుమారుడు ముక్రమ్(5) తల్లి చెంతే కూర్చున్నాడని, ప్రమాదం జరగడానికి నిమిషం ముందు తన దగ్గరకు రావడంతో బతికాడని చెప్పాడు.
భార్యను పంపాలని అల్లుడి ఒత్తిడితో...
బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన ఖలీద్‌తో పాటు అతడి కూతురు సలీమా, ఆమె బిడ్డ, దాదాపు నెలన్నర వయసున్న శిశువు ప్రాణాలు కోల్పోయారు. ఖలీద్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. ఖలీద్ ఒక్కడి సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. పెద్ద కూతురు సలీమాకు పుట్టిన బిడ్డకు చిల్లి కార్యక్రమం (నామకరణ డోలారోహణం) కోసం బైక్‌ను కుదువపెట్టి వేడుక జరిపించాడు. ఆ మర్నాడే సలీమాను, బిడ్డను తీసుకెళ్తానని అల్లుడు చెప్పడంతో తానే రెండ్రోజుల్లో హైదరాబాద్‌కు తీసుకొస్తానని ఖలీద్ సముదాయించాడు. అయితే అల్లుడు పోరు పెట్టడంతో కుమార్తెను, మనుమరాలిని వెంటపెట్టుకొని ఖలీద్ బస్సులో బయలుదేరాడు. ప్రమాదంలో ఖలీద్, సలీమా, ఆ శిశువు ప్రాణాలు కోల్పోయారు. ఖలీద్‌కు ఇద్దరు కవల కుమారులు జమీర్, సమీర్ ఉన్నారు. చిన్న కూతురు సజియా ఇంట్లోనే ఉంటోంది. ఇప్పుడా కుటుంబం రోడ్డున పడింది.
కన్నవారి మృతితో అనాథలైన ఇద్దరు చిన్నారులు
బస్సు ప్రమాదంలో హజీపూర్‌కు చెందిన భార్యభర్తలు బందెప్ప, లక్షీ మృతిచెందారు. దీంతో వీరి కూతుళ్లు భవాని, శిరీష అనాథలయ్యారు. పెద్ద కూతురు శిరీష ఎనిమిదో తరగతి దాకా చదివి మానేసింది. చిన్న కూతురు శిరీష నాలుగో తరగతి చదువుతోంది. కుటుంబానికి పెద్దదిక్కు లేకపోవడంతో గ్రామంలోనే ఉంటున్న మేనమామ సురేశ్ చేరదీశాడు. పిల్లలను అన్ని విధాలా బాగా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు.
తెలిసినవారి బైక్ ఎక్కించి మరీ బస్టాండ్ వరకు దింపి..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థి అఖిలారెడ్డి అంత్యక్రియలు మంగళవారం గ్రామంలో జరిగాయి. అఖిలారెడ్డి తల్లి అలివేలు రోదనను చూసి పలువురు కన్నీరు పెట్టారు. బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత అఖిల ఎంబీఏ కోసం గచ్చిబౌలి ఐఐఆర్‌ఏం కళాశాలలో చేరింది. సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు ఒక రోజు ముందుగానే సాయిపూర్‌లోని తన ఇంటికి అఖిలారెడ్డి వచ్చింది. ఉదయమే ఆర్టీసీ బస్సు వరకు పంపించేందుకు ఆటోలు లేకపోవడంతో పొరుగున ఉన్న తెలిసిన వారి బైక్‌పై అఖిలారెడ్డిని బస్టాండ్‌కు పంపించి బస్సులో ఎక్కించారు. తాను బస్సు ఎక్కానని తల్లి, పిన్నికి అఖిల ఫోన్ చేసి చెప్పింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి.
రోడ్డున పడ్డ డ్రైవర్ కుటుంబం
ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. వికారాబాద్ జిల్లా మంతట్టికి చెందిన అహ్మద్‌మియా-షౌకత్‌బేగం దంపతుల కొడుకే దస్తగిరి. అతడికి రుక్సానబేగం, గౌషియాబేగం అనే చెల్లెళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం వీరు 20ఏళ్ల కిందట తాండూరుకు ఈ కుటుంబం వలసొచ్చింది. అహ్మద్‌మియా 19ఏళ్ల కిందట మరణించాడు. కుటుంబ పోషణ భారం దస్తగిరిపై పడింది. భార్య హసీనాబేగం, అంధురాలైన తల్లితో కలిసి దస్తగిరి పదేళ్లుగా తాండూరులో ఉంటున్నాడు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తలకు మనస్పర్థలు రావడంతో మూడేళ్ల కింద అతడి భార్య పుట్టింటికి పోయింది. వారికి పదేళ్ల లోపు ఇద్దరు కొడుకులున్నారు. అంధురాలైన తల్లి బాగోగులు చూసుకునేందుకు రెండున్నరేళ్ల కింద హైదరాబాద్‌కు చెందిన సాజిదాను దస్తగిరి రెండో పెళ్లి చేసుకున్నాడు. 15రోజుల క్రితం దస్తగిరి తల్లి ప్రమాదవశాత్తు పడటంతో కాలు విరిగింది. ఆస్పత్రి ఖర్చులతో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. వచ్చే డబ్బు సరిపోక ఒక్కోసారి డబుల్ డ్యూటీ చేసేవాడని దస్తగిరి సోదరి రుక్సానా తెలిపింది. కంటి చూపులేని తమ తల్లిని ఎవరి వద్ద ఉంచాలో తెలియడం లేదని విలపిస్తోంది.