Share News

Unauthorized Aadhaar: ఆధార్‌.. బేజార్‌!

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:49 AM

ఆధార్‌లో మార్పులు, చేర్పులు, ఇతర అవసరాల కోసం బయోమెట్రిక్‌ వేలిముద్ర తప్పనిసరి. అది లేకుండా లాగిన్‌ చేయలేం. అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రైవేటు...

Unauthorized Aadhaar: ఆధార్‌.. బేజార్‌!

  • అసలు వ్యక్తులకు తెలియకుండా..బయోమెట్రిక్‌.. ఓటీపీ లేకుండానే లాగిన్‌

  • ఒక్కో ఆధార్‌పై 100కి పైగా లాగిన్లు

  • రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఘటనలు

  • యూఐడీఏఐకి పెద్దఎత్తున ఫిర్యాదులు

  • ‘బయోమెట్రిక్‌ బ్లాక్‌’ చేస్తేనే రక్షణ : నిపుణులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఆధార్‌లో మార్పులు, చేర్పులు, ఇతర అవసరాల కోసం బయోమెట్రిక్‌ వేలిముద్ర తప్పనిసరి. అది లేకుండా లాగిన్‌ చేయలేం. అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ముకే్‌షకు తెలియకుండానే ఆయన ఆధార్‌లో ఆరు రోజుల్లో 230సార్లు ఎవరో లాగిన్‌ అయ్యారు. ఇందులో ఎక్కువసార్లు అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారి శేఖర్‌ రెడ్డి వారం రోజులుగా శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఆయన పేరుతో ఆధార్‌లో గత 15 రోజుల్లో 162సార్లు లాగిన్‌ అయ్యారు. ఇందులోనూ అత్యధికం అర్ధరాత్రే. అయితే ఆధార్‌లో మార్పుల కోసం తాము ఆధార్‌ కేంద్రానికి వెళ్లలేదు... బయోమెట్రిక్‌ ఇవ్వలేదు.. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పలేదు.. అయినా ఇతరులు ఎలా లాగిన్‌ అవుతున్నారు? అన్నది వీరి ప్రశ్న. ఈ సమస్య వీరిద్దరిదే కాదు.. తెలంగాణలో వేలాదిమంది ఎదుర్కొంటోన్న సమస్య.

ఎలా సాధ్యం.. ఎందుకు?

ఆధార్‌ అంటే పూర్తి భద్రత.. పౌరుల వ్యక్తిగత వివరాలు పూర్తిగా సురక్షితం.. అని కేంద్రప్రభుత్వం చెబుతూ ఉంటోంది. మరి పౌరుడి ప్రమేయం లేకుండా.. ఇతరులు ఎలా లాగిన్‌ అవుతున్నారు? బయోమెట్రిక్‌ ద్వారా ఆధార్‌ లాగిన్‌ చేస్తే అనుసంధానమై ఉన్న ఈ-మెయిల్‌కు ‘మీ ఆధార్‌కు విజయవంతంగా లాగిన్‌ అయ్యారు’ అన్న సందేశం వస్తుంది. ఇది కేవలం ఈ-మెయిల్‌ అనుసంధానం చేసినవారికే వస్తుంది. లాగిన్‌ సమయం, చేసిన ప్రాంతం వివరాలు కూడా అందులో ఉంటాయి. అయితే రాష్ట్రంలో గత 20 రోజుల నుంచి అనేకమంది ఇలాంటి సందేశాలను ఈ-మెయిల్‌ ద్వారా చూసి షాక్‌కు గురవుతున్నారు. అందులో లాగిన్‌ చేసిన ప్రాంతం వివరాలు ఉండటం లేదు. ‘ఆన్‌లైన్‌ లాగిన్‌’ అన్న సందేశం వస్తుంది. రాష్ట్రంలోని అన్ని ఆధార్‌ కేంద్రాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తాయి. అయితే ఈ లాగిన్‌ అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువసార్లు జరుగుతోంది. తమ అనుమతి లేకుండా ఎవరో లాగిన్‌ అవుతున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నగరంలోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ ఆధార్‌లో ఇతరులెవరో అనేకసార్లు లాగిన్‌ అయ్యారని, దాంతో నేర కార్యకలాపాలకు పాల్పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారని.. వారు అఽధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై యూఐడీఏఐ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారిస్తామని బదులిస్తున్నారు. నేరగాళ్లు ఇతరుల ఆధార్‌ ఉపయోగించి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.


క్లోనింగ్‌పై అనుమానాలు

ఆధార్‌ కోసం వినియోగించే బయోమెట్రిక్‌ వేలిముద్రలను క్లోనింగ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులు గతంలో భారీగా వచ్చాయి. బయోమెట్రిక్‌ కోసం మీసేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో, ఇతర చోట్ల ఉపయోగించే యంత్రాలతో వేలిముద్రల క్లోనింగ్‌ చేసి ప్లాస్టిక్‌ వేలిముద్రలతో లాగిన్‌ అవుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై స్పందించిన యూఐడీఏఐ పాత ఎల్‌-జీరో యంత్రాలను వినియోగించకూడదని ఆదేశించింది. వాటి స్థానంలో క్లోనింగ్‌కు అవకాశం లేని ఎల్‌-1 యంత్రాలు ఉపయోగించాలని కోరింది. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో అనేక చోట్ల పాత ఎల్‌-జీరో యంత్రాలే వినియోగంలో ఉన్నాయి. దీని ఆధారంగా బయోమెట్రిక్‌ క్లోనింగ్‌తో మోసాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ ఆధార్‌లో ఎవరు.. ఎప్పుడు లాగిన్‌ అయ్యారన్న సమాచారాన్ని యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ‘లాగిన్‌ హిస్టరీ’ ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని పరిశీలిస్తూ ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా యూఐడీఏఐకి ఫిర్యాదు చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఇతరులెవరూ ఆధార్‌ బయోమెట్రిక్‌ ఉపయోగించకుండా.. ఆధార్‌ వెబ్‌సైట్లో ‘బ్లాక్‌ బయోమెట్రిక్‌’ ఆప్షన్‌ ఉపయోగించుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దీంతో వారి ఆధార్‌ను ఇతరులు లాగిన్‌ చేయడం అసాధ్యమని అంటున్నారు. ఆధార్‌ ఉపయోగిస్తున్న సందర్భంలోనే దీన్ని అన్‌లాక్‌ చేయాలని, ఎప్పుడూ ‘లాక్‌’ చేసి ఉంచాలని సూచిస్తున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 02:49 AM