ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:31 AM
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
చిట్యాల రూరల్, చౌటుప్పల్ టౌన్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. సోమవారం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు సుమారు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌జామ్ అయింది. విద్యా సంస్థలకు సెలవులు ముగియడంతో వాహనాలు హైదరాబాద్‌కు బాట పట్టాయి. పెద్దకాపర్తి వరకు వెళ్లేసరికి బస్‌స్టేజీ సమీపంలో ఫ్లైఓర్ బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో వాహనాలను సర్వీసు రోడ్డు నుంచి దారి మళ్లిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు వెళ్లడానికి సుమారు 30నిమిషాలకు పైగా సమయం పట్టిందని వాహనదారులు తెలిపారు. వాహనాలు నిలిచిపోకుండా నార్కట్‌పల్లి సీఐ నాగరాజు పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బందితో పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ వంతెన పనులు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరింపజేశారు
రాత్రంతా వర్షం.. ట్రాఫిక్‌కు ఆటకం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 11:30 గంటల వరకు వాహనాల రద్దీ కొనసాగింది. ఏపీలోని వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు భారీగా వాహ నాలు రావడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్ల్లైఓవర్ నిర్మిస్తుండడంతో కొన్ని వాహనాలను సర్వీసు రోడ్ల వెంట పంపిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చౌటుప్పల్ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ కొనసాగిందని వాహనదా రులు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తెల్లవారు జాము నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. చౌటుప్పల్ ఏసీపీ మధు సూదన్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు మన్మథ కుమార్, విజయ్‌మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.