Share News

kumaram bheem asifabad-మున్సిపాలిటీకి యూడీఎఫ్‌ నిధులు

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:52 PM

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.18 కోట్లు యూడీఎఫ్‌ నిధులు విడుదలయ్యాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలకు పరిష్కారం దొరకనుంది. గత నెల రోజుల క్రితం ఈ నిధులు విడుదల కావటంతో కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వేలు చేపట్టారు. అత్యవసరమున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు రోడ్లు, డ్రైన్‌, అంతర్గత రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి ఉన్నతాధికారులకు నివేదికలను సమర్పించారు. అ

kumaram bheem asifabad-మున్సిపాలిటీకి యూడీఎఫ్‌ నిధులు
లోగో

- అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.18 కోట్లు యూడీఎఫ్‌ నిధులు విడుదలయ్యాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలకు పరిష్కారం దొరకనుంది. గత నెల రోజుల క్రితం ఈ నిధులు విడుదల కావటంతో కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వేలు చేపట్టారు. అత్యవసరమున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు రోడ్లు, డ్రైన్‌, అంతర్గత రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి ఉన్నతాధికారులకు నివేదికలను సమర్పించారు. అలాగే టెక్నికల్‌ అనుమతి కోసం పంపించారు. ఈ ప్రక్రియ కాగానే టెండరు ప్రక్రియ త్వరలోనే నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు.

- అభివృద్ధి పనులకు..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటకీ యూటీఎఫ్‌ కింద రూ.18 కోట్ల నిధులు విడుదల కావడంతో సర్‌సిల్క్‌ రోడ్డు నుంచి డాడానగర్‌ చౌరస్తా వరకు నూతన రోడ్డు నిర్మాణం, రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి సంజీవయ్య కాలనీ వరకు నూతన రోడ్డు, ఆదర్శనగర్‌లో రోడ్డు, కాపువాడలో నూతన డ్రైన్‌, 30 వార్డుల్లో అంతర్గత నూతన రోడ్డు నిర్మాణం, పెట్రోలు పంపు జడ్పీ స్కూల్‌ నుంచి రోడ్డు నిర్మాణం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కోసం నిధులను కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిధులు విడుదల కావడంతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. సర్‌సిల్క్‌ ఏరియాలో కనీసం ద్విచక్ర వాహనం పోవాలంటే కూడా గతంలో వేసిన రోడ్డు పూర్తిగా పగుళ్లు తేలి ఉంది. రాత్రి వేళల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాపువాడలో డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడంతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్ల ముందే నీరు నిలుస్తుండడంతో ఏటా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెట్రోలు పంప్‌ జడ్పీ పాఠశాల రోడ్డు పూర్తిగా నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. వర్షాకాలంలో ఈ మార్గంలో బైక్‌లు కూడా పోలేని పరిస్థితి ఉంటుంది. ఈ మార్గం గుండా వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూడీఎఫ్‌ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 09:52 PM