Free Bus Travel: ఉచిత బస్సుకు రూ.8402 కోట్లు!
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:42 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.....
రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకానికి 700 కోట్లు.. ఈ పథకాలతో మహిళా సాధికారతకు అడుగులు
ఉచిత విద్యుత్తుకు రూ.3438 కోట్లు
రైతు భరోసాకు రూ.21426 కోట్ల వ్యయం
రూ.20,616 కోట్లతో రైతులకు రుణమాఫీ
ఇందిరమ్మ ఇళ్లకు రూ.3200 కోట్ల ఖర్చు
రెండేళ్లలో సాధించిన విజయాలను వెల్లడించిన సర్కారు
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల పథకాలతో మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచడంతో పేదల ఆరోగ్యానికి మరింత భరోసా లభించింది. గడిచిన రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు సాధించిన విజయాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది.
మహిళలకు ఉచిత ప్రయాణం..
రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. సగటున రోజుకు 34.32 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపింది. ‘ఈ ఏడాది డిసెంబరు 1 నాటికి రూ.8402 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయి. ’ అని వెల్లడించింది. ‘పేదింటి మహిళలపై గ్యాస్ సిలిండర్ భారాన్ని తగ్గించాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి, మిగతా మొత్తాన్ని భరిస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీతో లబ్ధి పొందుతున్నాయి. వీరి పేరిట చెల్లించాల్సిన దాదాపు రూ.700 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లిస్తోంది’ అని వివరించింది. ‘200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేశాం. దీంతో దాదాపు 52.28 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది. ఇప్పటివరకు దాదాపు రూ.3438 కోట్ల సబ్సిడీని విడుదల చేశాం’ అని ప్రభుత్వం వెల్లడించింది.
రైతు భరోసా పెట్టుబడి సాయం..
రైతుల సంక్షేమం, వ్యవసాయ పురోగతికి భారీ పథకాలను అమలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేశాం. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేశాం. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేశాం. కాగా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని అమలు చేస్తున్నాం. సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 అదనంగా బోనస్ రూపంలో ఇస్తున్నాం. ఈ సీజన్‌లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించాం. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేశాం. ఏకంగా 25.35 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. తొలి ఏడాదిలోనే రూ.20616 కోట్ల రుణమాఫీ చేశాం’ అని వివరించింది.
ఇందిరమ్మ ఇళ్లు
ఇల్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఈ పథకం కింద ఈ ఏడాది రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై, వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇళ్లకు రూ.3,200 కోట్లకు పైగా నిధులను విడుదల చేశాం.’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు..
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. ప్రస్తుతం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటికి ప్రభుత్వం రూ.15600 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వివరించింది.