Mahbubabad: బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:58 AM
బతుకమ్మ సంబరాల్లో విషా దం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతూ గుండెపోటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో...
కొత్తగూడ (మహబూబాబాద్ జిల్లా)/కోహీర్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ సంబరాల్లో విషా దం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతూ గుండెపోటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంకు చెందిన శెట్టి మౌనిక (32) బతుకమ్మ ఆడేందుకు ఇద్దరు కూతుళ్లు, కుమారునితో కలిసి గ్రామంలోని గుడి వద్దకు వెళ్లింది. బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడుతున్న సమయంలోనే మౌనిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మౌనికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంగలి మేఘన(24) సైతం బతుకమ్మ ఆడుతుండగా ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి పడిపోయింది. వెంటనే అక్కడున్న మహిళలు జహీరాబాద్‌లోని ప్రభ్వుత ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.