Government Officials Caught Taking Bribes: ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:24 AM
రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నియంత్రణ అధికారులకు పట్టుబడ్డారు.
కారేపల్లిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.10 వేల లంచం
జీపీఎఫ్, వైద్య బిల్లుల కోసం రూ.9వేలకు బాసర సీనియర్ అసిస్టెంట్ కక్కుర్తి
హైదరాబాద్/ కారేపల్లి/ బాసర, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నియంత్రణ అధికారులకు పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా సింగరేణి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ-1 దౌలూరి శుభ కామేశ్వరి లలితా పురం చెక్ పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ఒక వ్యక్తి తనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలన్నాడు. ఆ సర్టిఫికెట్ జారీ చేయడానికి రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం ఉదయం కారేపల్లి ప్రభుత్వాస్పత్రి సమీపాన ఆమె అద్దెకున్న ఇంటి వద్ద రూ.10 వేలు లంచం ఇస్తుండగా డీఎస్పీ వై.రమేశ్ సారథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా తానూర్ పీహెచ్‌సీ సూపర్‌వైజర్ సాయిబాబా తన జీపీఎఫ్, వైద్య బిల్లుల క్లియరెన్స్ కోసం పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించాలంటే రూ.9,000 లంచం ఇవ్వాలని నిర్మల్ జిల్లాలోని బాసర పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్ భీమన్న డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను కలిసిన సాయిబాబా.. వారి సూచన మేరకు భైంసాలోని భీమన్న ఇంట్లోనే ఆయనకు ఫోన్‌పే ద్వారా రూ.9,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ మధు ఆధ్వర్యంలో భీమన్నను అదుపులోకి తీసుకున్నారు.