Share News

Bus Incident: హడలెత్తించిన మరో రెండు బస్సులు

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:46 AM

మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాద ఘటనను మరువక ముందే.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరో రెండు...

Bus Incident: హడలెత్తించిన మరో రెండు బస్సులు

  • ఒక బస్సులో షార్ట్‌ సర్క్యూట్‌తో పొగలు

  • లగేజీతో సహా దిగి ప్రయాణికుల పరుగులు

  • రోడ్డుపక్కకు దూసుకెళ్లిన మరో బస్సు

  • నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఘటనలు

పొదలకూరు, మార్కాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాద ఘటనను మరువక ముందే.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరో రెండు ప్రైవేట్‌ బస్సులు ప్రయాణికులను హడలెత్తించాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు నుంచి శనివారం రాత్రి 11 గంటలకు 15 మంది ప్రయాణికులతో బెంగళూరుకు ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బయలుదేరింది. అక్కడి నుంచి 3కి.మీ. దూరాన ఉన్న మర్రిపల్లిగ్రామం వద్దకు రాగానే బస్సులో నుంచి పొగలు, మాడిన వాసన వచ్చింది. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. డ్రైవర్‌ బస్సును నిలిపివేయడంతో వెంటనే వారు తమ లగేజీలతో సహా కిందకు దిగి పరుగులు తీశారు. బ్యాటరీ వైర్ల షార్ట్‌సర్క్యూట్‌ వల్ల పొగలు వచ్చినట్లు డ్రైవర్‌ తెలిపారు. మరో బస్సును ఏర్పాటు చేసినా, ఆలస్యం కారణంగానూ, భయంతోనూ ప్రయాణికులు ఎవరూ ఎక్కలేదు. మరో ఘటనలో.. మార్కాపురం నుంచి రాయల్‌ వొయేజ్‌ (ఆర్‌వీటీ) ట్రావెల్‌ బస్సు ఏడుగురు ప్రయాణికులతో బెంగళూరుకు బయల్దేరింది. వేములకోట గ్రామం దాటిన తర్వాత కోమటికుంటకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి డ్రైవర్‌ హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌ దాటి ముందుభాగం పొలంలోకి వెళ్లింది. బస్సు బోల్తాపడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. లగేజీతో సహా దిగిపోయారు.

Updated Date - Oct 27 , 2025 | 01:46 AM