Niloufer Hospital: నీలోఫర్ నుంచి 2 యూనిట్లు కింగ్ కోఠికి!
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:25 AM
నీలోఫర్ ఆస్పత్రిలో రోగుల తాకిడి పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీలోఫర్‌లోని రెండు యూనిట్లను కింగ్‌కోఠి మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆస్పత్రికి...
రోగుల రద్దీతోనే.. కింగ్ కోఠి ఆస్పత్రిలో ఓ ఫ్లోర్ ఖాళీ
అక్కడ 100 బెడ్లతో ఏర్పాటు.. అధికారుల పరిశీలన
నిలోఫర్‌కు రోజుకు సగటున 1200 ఓపీ నమోదు
యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక కమిటీ
నివేదిక రాగానే నిధులు.. ఆ వెంటనే వైద్య సేవలు
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నీలోఫర్ ఆస్పత్రిలో రోగుల తాకిడి పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీలోఫర్‌లోని రెండు యూనిట్లను కింగ్‌కోఠి మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించింది. కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఒక అంతస్తు మొత్తం ఖాళీగా ఉండటంతో అక్కడ 100 పడకలతో 2 పిడియాట్రిక్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారుల బృందం కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించింది. వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, టీజీఎంఎ్‌సఐడీసీ ఎండీ ఫణీంద్రారెడ్డి కింగ్‌కోఠి దవాఖానాను సందర్శించారు. కాగా నీలోఫర్ నుంచి రెండు యూనిట్లను కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించడానికి సంబంధించి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో నీలోఫర్, కింగ్‌కోఠి ఆస్పత్రుల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ పిడియాట్రషియన్స్, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)కి చెందిన ఓ ఇంజనీర్ ఉన్నారు. ఈ కమిటీ పిడియాట్రిక్ యూనిట్ల ఏర్పాటు చేయడానికి వైద్య పరికరాలు, యంత్రాలు ఏమేం కావాలి? కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు.. వాటి కోసం ఎంత ఖర్చు అవుతుంది? అనే అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. అనంతరం పిడియాట్రిక్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం నీలోఫర్ ఆస్పతిల్రో రోజుకు సగటున 1200 ఓపీ నమోదు అవుతోంది. సీజనల్ వ్యాధుల సమయంలో అది ఇంకా ఎక్కువగా ఉంటోంది. అరోగ్యపరమైన ఇబ్బందులతో వచ్చే చిన్నారులకు కొన్నిసార్లు పడకలు కూడా దొరకడం లేదు. ఒకరిని డిశ్చార్జి చేస్తేనే మరొకరిని చేర్చుకునే పరిస్థితి నెలకొంది. దీంతో నీలోఫర్‌లో రోగుల తాకిడి కొంతమేరకు మళ్లించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కింగ్‌కోఠి ఆస్పత్రిని వైద్యశాఖ పిడియాట్రిక్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ఆస్పత్రిగా గుర్తించింది.
డీఎంఈ కార్యాలయానికి బ్రాండింగ్
కోఠిలోని వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయాన్ని బ్రాండింగ్ చేయాలని వైద్యశాఖ యోచిస్తోంది. నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో కోఠిలోని డీఎంఈ క్యాంప్‌సకు వస్తుంటారు. ఆ క్యాంప్‌సలోనే డీఎంఈ, టీవీవీపీ, డీహెచ్, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, పారామెడికల్ బోర్డ్, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉన్నాయి. డీఎంఈ బిల్డింగ్‌లోనే కీలకమైన విభాగాధిపతులున్నారు. డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, పారామెడికల్ బోర్డు కార్యదర్శి, వైద్య నియామకాల కార్యదర్శి ఆఫీసులున్నాయి. పురాతన భవనం కావడం, వర్షాలకు చెమ్మ దిగడంతో భవనమంతా ఒకరకమైన దుర్గంధం వస్తోంది. ఎక్కడా కూడా సరైన మరుగుదొడ్లు లేవు. వాటిలో నీళ్లు ఉండటం లేదు. వచ్చే సందర్శకులు కూర్చునేందుకు సరైన స్థలం, కుర్చీలు లేవు. ముఖ్యంగా ఒక్క విభాగాధిపతి కార్యాలయంలోనూ కనీసం మంచినీటి సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో డీఎంఈ కార్యాలయాన్ని కూడా బ్రాండింగ్ పరిఽధిలోకి తీసుకురానున్నారు. ప్రతి విభాగాధిపతి కార్యాలయంలో సందర్శకుల కోసం స్థలం కేటాయించడం, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాన్నారు. అలాగే భవనానికి ఎప్పుడో వేసిన రంగు పాలిపోయి భూత్ బంగ్లాగా మారింది. సరికొత్తగా రంగులు కూడా బ్రాండింగ్‌లో భాగంగా వేయనున్నారు.