Two Officials Caught Taking Bribes: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:17 AM
లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి మీటరు మంజూరు కోసం ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్వర్లును ....
రూ 15.వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ట్రాన్స్‌కో ఏఈ
రూ. 20వేలు తీసుకుంటూ చిక్కిన సివిల్ సప్లయ్స్ డీటీ
వెల్దండ/షాద్‌నగర్ అర్బన్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి మీటరు మంజూరు కోసం ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్వర్లును సంప్రదించాడు. ఏఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా.. తొలుత రూ.15 వేలు ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకుని, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనల మేరకు మంగళవారం ఏఈని తన ఇంటికి పిలిచి లంచం ఇస్తుండగా..నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఏఈని పట్టుకున్నారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లా పౌర సరఫరా కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగా పనిచేస్తున్న రవీందర్‌నాయక్ మూడు నెలల క్రితం ఫరూఖ్‌నగర్ మండలంలోని అన్నారం గ్రామ రేషన్‌షాపులో మూడు క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నాయని డీలర్ యాదగిరిపై కేసు నమోదు చేసి, ఆ షాపును మరో డీలర్‌కు అప్పగించారు. ఈ కేసు నుంచి తప్పించాలని డీలరు పలుమార్లు డీటీని కలవగా.. మొదట రూ.50 వేలు డిమాండ్ చేసినప్పటికీ .. తర్వాత రూ.20 వేలకు వారిద్దరి మధ ్య ఒప్పందం కుదిరింది. అనంతరం డీలర్ ఏసీబీ అధికారులను కలిశాడు. ఈ క్రమంలో మంగళవారం రవీందర్‌నాయక్ షాద్‌నగర్‌కు వచ్చి డీలర్ నుంచి లంచం తీసుకుంటుండగా డీఎస్పీ ఆనంద్ బృందం వల పన్ని పట్టుకుంది.