Share News

Two Missing in Hyderabad Flood: మంచం కోసం వెళ్లి ఒకరు..అతన్ని కాపాడబోయి ఇంకొకరు..

ABN , Publish Date - Sep 16 , 2025 | 06:06 AM

హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రామ్‌(32), అర్జున్‌(26)ల ఆచూకీ ఇంకా తెలియలేదు. మల్లేపల్లి మాంగర్‌ బస్తీకి చెందిన రామ్‌, అర్జున్‌ ఇద్దరూ బంధువులు...

Two Missing in Hyderabad Flood: మంచం కోసం వెళ్లి ఒకరు..అతన్ని కాపాడబోయి ఇంకొకరు..

హైదరాబాద్‌లోని మాంగర్‌ బస్తీలో వరద ఉధృతికి యువకులు రామ్‌, అర్జున్‌ గల్లంతు

  • 24గంటలు గడిచినా దొరకని ఆచూకీ

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైదరాబాద్‌ కలెక్టర్‌, హైడ్రా కమిషనర్‌

అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రామ్‌(32), అర్జున్‌(26)ల ఆచూకీ ఇంకా తెలియలేదు. మల్లేపల్లి మాంగర్‌ బస్తీకి చెందిన రామ్‌, అర్జున్‌ ఇద్దరూ బంధువులు. రామ్‌ మేకల చర్మం అమ్మి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అర్జున్‌ కూడా అతనితో కలిసి పనికివెళ్లేవాడు. వీరు అఫ్జల్‌సాగర్‌ నాలాపైన నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో వర్షం కురిసినప్పుడల్లా ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు వీరి ఇంటి ముందున్న ఐదు ఫీట్ల చిన్నపాటి గల్లీగుండా పక్కనే ఉన్న అఫ్జల్‌సాగర్‌ నాలాలోకి వెళ్తుండేది. ఆదివారం ఆ గల్లీలో వరదలో తమ మంచం కొట్టుకుపోతుండగా రామ్‌ దాన్ని తీసుకురావడానికి నీళ్లలోకి వెళ్లాడు. నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. అతని భార్య కేకలు వేయడంతో రామ్‌ను కాపాడటానికి అర్జున్‌ వరద నీటిలోకి దిగాడు. దాదాపు 6ఫీట్ల ఎత్తుతో వరద రావడంతో ఇద్దరూ ఒక్కసారిగా అఫ్జల్‌సాగర్‌ నాలాలోకి పడిపోయారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా వారి జాడ తెలియలేదు. దీంతో, హబీబ్‌నగర్‌ పోలీసులకు సమాచారమందించారు. వెంటనే డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగినప్పటికీ రామ్‌, అర్జున్‌ల ఆచూకీ దొరకలేదు. సోమవారం ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, హైడ్రా మూడు ప్రత్యేక బృందాలు రామ్‌, అర్జున్‌ల జాడ కోసం అఫ్జల్‌సాగర్‌ నాలా నుంచి మూసారాం నాలా వరకు వెతికారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మాజిద్‌ హుసేన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పరిశీలించారు. గల్లంతైన వారి కుటుబసభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ.. బాధిత కుటుంబసభ్యులకు రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. ‘‘అఫ్జల్‌సాగర్‌ నాలా పైన 140దాకా నివాసాలున్నాయి. గతంలో అనేకసార్లు వీరికి నోటీసులిచ్చాం. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’’ అని తెలిపారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ.. రెండు మూడు అక్రమ నిర్మాణాలు వరదకు అడ్డుపడ్డాయని, త్వరలో నాలా దగ్గర కొన్ని ఇళ్లను తొలగిస్తామని చెప్పారు. అమీర్‌పేట మైత్రీవనం దగ్గర ముంపు సమస్యను పరిష్కరించామని రంగనాథ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఇక్కడ 25 లారీల పూడిక తీసినట్టు వెల్లడించారు. నగరంలోని వరద నీటి కాలువల్లో ఇప్పటి వరకు 2,200 లారీల పూడిక తొలగించామని, ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు.

Updated Date - Sep 16 , 2025 | 06:06 AM