Congress Party: డివిజన్‌కు ఇద్దరు మంత్రులు
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:10 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బాధ్యతలు
అప్పగించిన మహేశ్‌గౌడ్, మీనాక్షీ నటరాజన్
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇప్పటిదాకా ఈ ఉప ఎన్నిక ఇన్‌చార్జి బాధ్యతలను ముగ్గురు మంత్రులే పర్యవేక్షిస్తుండగా.. ఇకపై క్యాబినెట్ మొత్తాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించింది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు డివిజన్లకుగాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున కేటాయించి.. వారికి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. తమకు కేటాయించిన డివిజన్లలో ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలపై ఓటర్లకు తగిన భరోసా ఇచ్చే బాధ్యత కూడా వారిదేనని పేర్కొంది. ఇందులో భాగంగా యూసు్‌ఫగూడ డివిజన్‌ను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు, రహమత్‌నగర్ డివిజన్‌ను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వెంగళ్‌రావునగర్ డివిజన్‌ను తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి, సోమాజిగూడ డివిజన్‌ను శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కు, షేక్‌పేట్ డివిజన్‌ను కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామికి, ఎర్రగడ్డ డివిజన్‌ను మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు కేటాయించారు. ఇక బోరబండ డివిజన్ బాధ్యతలను మంత్రి సీతక్కతోపాటు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి అప్పగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యులతో సోమవారం రాత్రి వరకూ టూరిజం ప్లాజాలో జరిగిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నమూనాగా చూపించి ఎన్నికలకు వెళ్లాలనుకుంటోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు చాలా కీలకమన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వేలు కాంగ్రెస్ అభ్యర్థికే సానుకూలంగా ఉన్నాయని మంత్రి వివేక్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారానికి దిగిన తర్వాత ఈ సానుకూలత పెరుగుతుందని చెప్పారు.
మైనారిటీ నేతలతో మహేశ్ భేటీ
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు. గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వివిధ సంస్థల చైర్మన్లు రియాజ్, కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు.