Road Accident: డివైడర్ దాటి మరో కారు మీద పడిన కారు
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:41 AM
జాతీయ రహదారిపై వెళుతోన్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి మరో కారుపై పడడంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరి మృతి..
రాజాపూర్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిపై వెళుతోన్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి మరో కారుపై పడడంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన రంజిత్ రెడ్డి(34) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. పెద్దల పండుగ కోసం భార్య చైతన్య, కుమార్తెలతో కలిసి 20వ తేదీన అత్తగారి ఊరైన పెద్దమందడి మండలంలోని వెల్టూరుకు వచ్చారు. 22వ తేదీన సోమవారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అతడి మరదలు(భార్య చెల్లెలు) హారికారెడ్డి(23) కూడా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు అతడితో పాటు బయలుదేరింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న కారు జాతీయ రహదారిపై రాజాపూర్ మండల కేంద్రంలోని రెయిన్‌బో హోటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకొచ్చి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మాధవరెడ్డి క్షేమంగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.