Cybercrime: సైబర్ వలలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:46 AM
సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీస్ అధికారులకే కేటుగాళ్లు చుక్కలు చూపించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి దాదాపు రూ.40 లక్షల వరకు ...
నెల వ్యవధిలో రూ.40 లక్షలు లాస్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీస్ అధికారులకే కేటుగాళ్లు చుక్కలు చూపించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి దాదాపు రూ.40 లక్షల వరకు పోగొట్టుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లింక్ పంపి, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపారు. సదరు ఇన్‌స్పెక్టర్ లింక్‌లో ఉన్న నెంబర్లను సంప్రదించగా, ముందుగా స్పెషల్ ట్రైనింగ్ పేరుతో ‘దేవా ఏటీఎం 13’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. గ్రూపు సభ్యులు తాము భారీగా సంపాదించినట్లు పెట్టిన పోస్టులను చూసి ఇన్‌స్పెక్టర్ ముందుగా రూ. 50 వేలు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నాడు. పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో కనిపించటంతో దశలవారీగా రూ..39.37 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు పంపాడు. తర్వాత వెబ్‌సైట్‌లో భారీగా లాభాలు చూపినా, విత్‌డ్రా ఆప్షన్ తీసేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మరో ఇన్‌స్పెక్టర్‌కు కూడా సైబర్ నేరగాళ్లు ఫోన్‌చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేయిస్తామని చెప్పి పలు దఫాలుగా రూ.1.25 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సదరు ఇన్‌స్పెక్టర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.