Domestic Violence: రోకలితో బాది.. కత్తితో గొంతుకోసి..!
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:22 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య తన భర్తను కంట్లో కారం చల్లి, రోకలితో బాది, కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. జగిత్యాల జిల్లా....
కుటుంబ కలహాలతో భర్తను చంపిన భార్య
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో ఘటన
కామారెడ్డి జిల్లాలో దిండుతో అదిమి భర్త హత్య
మల్లాపూర్/ఎల్లారెడ్డి రూరల్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య తన భర్తను కంట్లో కారం చల్లి, రోకలితో బాది, కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య (55) కొంతకాలంగా తాగుడుకు బానిసై రోజూ భార్య రాజుతో గొడవ పడుతుండేవాడు. మల్లయ్య కొడుకు దుబాయ్‌లో ఉండగా కోడలు అత్తమామలతో కలిసి ఉంటోంది. బుధవారం ఉదయం మల్లయ్య కోడలు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా మల్లయ్య మద్యం తాగి వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పంట అమ్మగా వచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య రాజు తన భర్త మల్లయ్య కంట్లో కారం పొడి చల్లి, రోకలితో కొట్టగా కింద పడిపోయాడు. అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేసింది. తర్వాత కత్తితో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మరో ఘటనలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపల్ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన రత్నావర్ తుకారాం (36)ను భార్య మీనా హత్య చేసింది. తుకారాంకు మీనాతో 16 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య అనుమానాలు పెరిగి తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న మీనా మంగళవారం అర్ధరాత్రి తుకారాం ముఖంపై దిండుతో శ్వాస ఆడకుండా అదిమి హత్య చేసింది. మృతుడి సోదరుడు హర్జ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్ తెలిపారు.