Share News

Child Labour: గాజుల పరిశ్రమలో బాల కార్మికులు

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:34 AM

ప్రమాదకర ప్రదేశాల్లో బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇద్దరు గాజుల పరిశ్రమ యజమానులకు రంగారెడ్డి జిల్లా కోర్టు షాక్‌ ఇచ్చింది...

Child Labour: గాజుల పరిశ్రమలో బాల కార్మికులు

  • ఇద్దరు యజమానులకు 14 ఏళ్ల జైలు

  • రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రమాదకర ప్రదేశాల్లో బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇద్దరు గాజుల పరిశ్రమ యజమానులకు రంగారెడ్డి జిల్లా కోర్టు షాక్‌ ఇచ్చింది. నిందితులకు 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. పోలీసులు, చైల్డ్‌లైన్‌ అధికారులు 2022 జూన్‌ 18న బాలాపూర్‌ పరిధిలోని వెంకటాపూర్‌ క్రాస్‌ రోడ్స్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గాజుల తయారీ పరిశ్రమపై దాడి చేశా రు. అక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ఐదుగురు బాల కార్మికులను కాపాడి పునరావాస గృహానికి తరలించారు. బాల కార్మికులతో రోజుకు 10గంటలు పనిచేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కార్ఖానా యజమానులు మహ్మద్‌ అతీక్‌, మహ్మద్‌ అకీల్‌తో పాటు ఇంటి యజమాని సయ్యద్‌ పాషాపై కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగా బాల కార్మికుల తల్లిదండ్రులు బిహార్‌ నుంచి వచ్చి తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్‌ వేసి.. తీసుకెళ్లారు. గాజుల కార్ఖానా యజమానులతో పాటు బాల కార్మికులు కూడా బిహార్‌కు చెందినవారే. ఈ నేపథ్యంలో బాల కార్మికుల కుటుంబాలతో యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాల కార్మికులు, వారి తల్లిదండ్రులు విచారణకు హాజరు కావడం లేదు. పోలీసులు, పబ్లిక్‌ ప్రా సిక్యూటర్లు కలిసి బిహార్‌లోని సంబంధిత జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు నుంచి బాధితులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యేలా చూశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 7వ ఏడీజే కోర్టు నిందితులు అతీక్‌, అకీల్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకున్న విచారణ అధికారి బీ శ్రీకాంత్‌, ఏపీపీలు పద్మజారెడ్డి, గంగారెడ్డితో పాటు సిబ్బందిని సీపీ జీ సుధీర్‌బాబు అఽభినందించారు. కాగా, బాల కార్మికులను పనిలో పెట్టుకు న్న యజమానులకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పకపోవడం వల్ల చాలా కేసులు వీగిపోతుంటాయని ఏపీపీ గంగారెడ్డి తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 04:34 AM