Awareness Program: దేశంలో 2 కోట్లకు పైగా ఆటిజం బాధితులు
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:20 AM
భారతదేశంలో ఆటిజం కేసులు క్రమేణా పెరుగుతున్నాయని, నివేదికల ప్రకారం.. ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ) ఉన్నట్టు వెల్లడవుతోందని...
ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరికి ఇదే సమస్య.. బాధితుల్లో అబ్బాయిలు ఎక్కువ
ఆటిజంపై ‘లిమిట్ లెస్’ అవగాహన సదస్సు
హైదరాబాద్ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ఆటిజం కేసులు క్రమేణా పెరుగుతున్నాయని, నివేదికల ప్రకారం.. ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ) ఉన్నట్టు వెల్లడవుతోందని ‘బిల్డింగ్ బ్యాలెన్స్ అడ్వైజరీ’ వ్యవస్థాపకురాలు అర్నాజ్ సప్నా అష్రఫ్ అన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రజల్లో ఆటిజంపై అవగాహన పెరగాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. ఆటిజంపై అవగాహన కల్పించేందుకు.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం ‘లిమిట్ లెస్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఆటిజం బాధితులు రెండు కోట్లపైగానే ఉన్నారని.. వారిలో బాలికలతో పోలిస్తే బాలురు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారి కోసం ప్రభుత్వం, మార్గదర్శకాలు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆటిజంతో బాధపడే చిన్నారులకు.. బిహేవియర్ థెరపీ, శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చని ఆమె తెలిపారు. ఆటిజంపై అవగాహన లేకపోవడం, నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య బారినపడిన వారిని గుర్తించే అవకాశం లేకుండా పోయిందన్నారు. వీరికి చేసే చికిత్సలు, కౌన్సెలింగ్‌కు అయ్యే ఖర్చులను బీమా పరిధిలోకి తేవాలని.. ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న డాక్టర్ పూజా ఝానాయర్, డాక్టర్ సౌమ్యకంఠసాహు ఆరోగ్య బీమా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ‘సితారే జమీన్ పర్’ సినిమాలో నటించిన నమన్ మిశ్రా తల్లి మనీషా మిశ్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటిజం సమస్య ఉన్న పిల్లలకు ఏ విషయాన్ని అయినా ఓపికగా చెప్పాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆటిజం పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలలు లేవని ఆవేదన వెలిబుచ్చారు. ఆటిజం బారినపడ్డ పిల్లల తల్లిదండ్రులు, సైకాలజిస్టులు, పలు పాఠశాలల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆటిజం చిన్నారులకు ప్రత్యేక కరికులం
ఆటిజం అనేది వ్యాధి కాదు, దీనిని మందులతో నివారించలేము. ఆటిజం బారినపడ్డ పిల్లలకు సాధారణ పిల్లలతో పోల్చితే జ్ఞాపకశక్తి, చురుకుదనం తక్కువగా ఉంటుంది. వీరు సాటి పిల్లలతో చదువులో పోటీ పడలేరు. కాబట్టి ప్రతి స్కూల్‌లో విద్యార్థులకు ఆటిజం గురించి అవగాహన కల్పించాలి. మేం ఆటిజం పిల్లల కోసం ప్రత్యేక కరికులం రూపొందించాం. ఇది సాధారణ విద్యార్థులకూ ఉపయోగపడుతుంది.
- శంకర్ ఫౌండేషన్
ఫౌండర్ సెక్రటరీ శ్రీదేవి ప్రసాద్
త్వరలో పిల్లల మూడ్‌ను గుర్తించే ఏఐ యాప్
నా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతి కోపం, జుట్టుపట్టుకొని లాగడం, తనను తాను గాయపరుచుకోవడం వంటి లక్షణాలు ఉండేవి. తలుపు తెరిస్తే చాలు బయటకు పారిపోయేవాడు. అతడి సమస్యను మేం గుర్తించేందుకు ఐదేళ్లు పట్టింది. కౌన్సెలింగ్ సెషన్‌లకు తీసుకువెళుతున్న సమయంలో... ఏ సమయంలో కోపం వస్తోంది, ఏ సమయంలో దాడి చేస్తున్నాడు. ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడనే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక పోయేదాన్ని. ఐటీ ఉద్యోగినిగా 15 ఏళ్ల అనుభవం ఉన్న నేను ఇతర మిత్రులతో కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏథాన్ ఏఐ పేరుతో యాప్‌ను అభివృద్ది చేస్తున్నా. త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాము.
- శిల్ప పక్కి