Karimnagar: వాటర్ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:34 AM
కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులోని ఓ సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ క్యూరింగ్ వాటర్ ట్యాంక్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులోని ఓ సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ క్యూరింగ్ వాటర్ ట్యాంక్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానిక బొమ్మకల్ రోడ్‌లో ఉన్న సత్యం సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో బిహార్‌కు చెందిన బిట్టు కుమార్ అయిదేళ్లుగా కూలీగా పనిచేస్తూ ఫ్యాక్టరీ ఆవరణలోని షెడ్డులో భార్య సుధాదేవి, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం బయట ఆడుకుంటున్న వారి ఇద్దరు కుమారులు సత్యం కుమార్ (4), ఆర్యన్ కుమార్ (2) కనిపించకుండాపోయారు. ఫ్యాక్టరీ ఆవరణలో వెతికిన తల్లి సుధాదేవి వాటర్ ట్యాంక్‌లో ఆర్యన్ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించడం చూసి నిర్ఘాంతపోయింది. ఫ్యాక్టరీలోని కూలీలకు సమాచారం అందించగా వారు ఆర్యన్ మృతదేహాన్ని బయటకు తీశారు. నీటి లోపల వెతకగా సత్యం మృతదేహం కూడా అందులోనే ఉంది. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.